మున్సిపల్ ఎలెక్షన్స్ లో కుటుంబ పోరు.. అక్కపై చెల్లి గెలుపు, తల్లికి జయం-కొడుక్కి షాక్.. ఆసక్తికరంగా ఫలితాలు!

Must read

AP Municipal Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం రాజకీయ పార్టీల జయాపజయాలనే కాకుండా, పలు కుటుంబాల్లోని ఆసక్తికరమైన బంధాల సమీకరణాలను ప్రచారంలోకి తీసుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్ పదవుల కోసం భార్యాభర్తలు, తోడికోడళ్లు, అక్కాచెల్లెళ్లు, తల్లీకుమారులు ప్రత్యర్థులుగానూ, జంటగానూ ఎన్నికల బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెలువడిన ఫలితాల్లో కొందరి ఇంట గెలుపు సంబరాలు అంబరాన్నంటగా, మరికొన్ని కుటుంబాల్లో ఓటమి నిరాశను మిగిల్చింది.

నర్సీపట్నంలో తోడికోడళ్ల మధ్య సమరం.. తెదేపా అభ్యర్థి పద్మావతి ఘనవిజయం:

నర్సీపట్నం మున్సిపల్ ఛైర్‌పర్సన్ (AP Municipal Results)స్థానానికి జరిగిన తోడికోడళ్ల పోరు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడి సతీమణి, తెదేపా అభ్యర్థి పద్మావతి తన తోడికోడలు, వైకాపా అభ్యర్థి అనితపై 11,519 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. గతంలో అనిత ఛైర్‌పర్సన్‌గా, పద్మావతి కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఉండగా, ఈసారి కూటమి హవాలో పద్మావతి పీఠాన్ని దక్కించుకున్నారు.

ఎమ్మిగనూరు, పులివెందుల, పాలకొండల్లో సత్తా చాటిన భార్యాభర్తల జంటలు:

స్థానిక సంస్థల పోరులో పలువురు భార్యాభర్తలు జంటగా విజయకేతనం ఎగురవేసి రికార్డు సృష్టించారు. ఎమ్మిగనూరులో కూటమి ఛైర్‌పర్సన్ అభ్యర్థి మాచాని సునీతతో పాటు ఆమె భర్త ఎంబీ మహేష్‌కుమార్, పులివెందులలో కూటమి ఛైర్‌పర్సన్ తూగుట్ల గీతాకుమారి, ఆమె భర్త మధుసూదన్‌రెడ్డి, పాలకొండలో జనసేన ఛైర్‌పర్సన్ అభ్యర్థి పల్లా విజయనిర్మల, ఆమె భర్త కొండలరావు కౌన్సిలర్లుగా జంటగా గెలుపొందారు. అయితే ఆదోనిలో పోటీ చేసిన వైకాపా దంపతుల్లో భర్త గెలవగా భార్య ఓటమి పాలయ్యారు.

అక్కాచెల్లెళ్ల పోరులో అక్క విజయం.. గూడూరులో తల్లికి లక్.. కుమారుడికి షాక్:

ఇక ఇతర ఆసక్తికర పోరులో ఆదోని 52వ వార్డు నుంచి పోటీ చేసిన అక్కాచెల్లెళ్లలో వైకాపా తరఫున నిలిచిన అక్క ఇందు విజయం సాధించగా, తెదేపా నుంచి పోటీ చేసిన చెల్లెలు ఉష ఓడిపోయారు. గూడూరు నగర పంచాయతీలో భాజపా తరఫున ఛైర్‌పర్సన్‌గా పోటీ చేసిన తల్లి డమాం సునీత విజయం సాధించగా, కౌన్సిలర్‌గా నిలిచిన ఆమె కుమారుడు అక్షయ్ పరాజయం పాలయ్యారు. తుని పురపాలక సంఘంలో వేర్వేరు వార్డుల నుంచి పోటీ చేసిన వైకాపా దంపతులు కొప్పర్తి శ్రీలక్ష్మి, మూర్తి ఇద్దరూ ఓటమి పాలవ్వడం గమనార్హం.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!