తొలి వ‌న్డేకు ముందు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఆ నలుగురు ఫిక్స్‌..

Must read

Shubman Gill : బుధ‌వారం నుంచి భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల‌ వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వ‌న్డే మ్యాచ్ ఆక్లాండ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో తొలి వ‌న్డేకు ముందు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కూర్పుపై స్పష్టత ఇచ్చాడు.

బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో టాప్-4 స్థానాలు ఇప్పటికే ఖరారు అయ్యాయ‌ని చెప్పుకొచ్చాడు. అయితే ఐదో, ఆరో స్థానాల్లో మాత్రం మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను పంపించే ఫ్లెక్సిబుల్ విధానాన్ని అనుసరించనున్నట్లు వెల్లడించాడు.

భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో తొలి నాలుగు స్థానాల్లో తాను, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆడనున్నట్లు గిల్ స్పష్టం చేశాడు. ఈ నలుగురూ కుడిచేతి వాటం బ్యాటర్లే కావడంతో ప్రత్యర్థి బౌలింగ్‌ను బట్టి మిడిల్ ఆర్డర్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ అవసరమైతే అక్షర్ పటేల్‌ను ముందుగా పంపించనున్నట్లు తెలిపాడు. ఐదో, ఆరో స్థానాల్లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయనున్నారని పేర్కొన్నాడు.

‘ఐదో, ఆరో స్థానాల విషయంలో మేము ఫ్లెక్సిబుల్ విధానాన్ని అనుసరిస్తాం. మా టాప్-4 బ్యాటర్లు కుడిచేతి వాటం ఆటగాళ్లే. కాబట్టి ఎడమచేతి వాటం బ్యాటర్ అవసరమైతే అక్షర్ భాయ్ ముందుకు వస్తాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి కేఎల్ రాహుల్ భాయ్ కూడా ముందుగా బ్యాటింగ్‌కు రావచ్చు.’ అని గిల్ వివరించాడు.

గతంలో త‌న‌ను ఇబ్బంది పెట్టిన మెడ నొప్పితో పాటు ఫిట్‌నెస్‌పై స్ప‌ష్ట‌త ఇచ్చాడు. ప్రస్తుతం ఎలాంటి అసౌకర్యం లేదని, సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించాడు.

‘ఎలాంటి సమస్య లేదు. నేను దాదాపు గంటన్నర పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఫీల్డింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాను. ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు.’ అని గిల్ తెలిపాడు.

ఇక పోతే.. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై వన్డేల్లో గిల్ రికార్డు అంత అద్భుతంగా ఏమీ లేదు. కివీస్‌లో ఐదు వన్డేలు ఆడిన అతడు కేవలం 124 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని గిల్ పట్టుదలతో ఉన్నాడు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!