Jaggayyapeta Municipal Result: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘం పరిధిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం(Jaggayyapeta Municipal Result) సాధించారు. జగ్గయ్యపేటలోని 31వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఆమె, మంగళవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థిపై 540 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజయాన్ని అందుకోవడంతో కూటమి నేతలు, జనసేన శ్రేణులు, అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
వైకాపాకు దూరమైన వాసిరెడ్డి పద్మ.. కుమార్తె జనసేన నుంచి గెలుపొందడంపై రాజకీయంగా తీవ్ర చర్చ:
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరఫున జగ్గయ్యపేట అసెంబ్లీ టికెట్ ఆశించిన వాసిరెడ్డి పద్మకు పార్టీ నాయకత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె నాటి నుంచి ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె కుమార్తె మేఘన జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ ఆధిక్యంతో జయకేతనం ఎగురవేయడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మేఘన విజయం సాధించడంతో జగ్గయ్యపేటలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.



