Shreyas Iyer : ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 87 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీనిపై భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. జట్టు ప్రదర్శనపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బౌలర్ల వైఫల్యం కారణంగా తాము ఓటమి పాలు అయినట్లుగా చెప్పుకొచ్చాడు.
గ్లెన్ ఫిలిప్స్ (107; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీ, మైఖేల్ బ్రేస్‌వెల్ (65; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 260 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో తిలక్ శర్మ (35; 35 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), నమన్ ధీర్ (28; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (27; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ నాలుగు వికెట్లు తీశాడు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మాథ్యూ ఫిషర్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆడమ్ మిల్నేఓ వికెట్ సాధించాడు.
బౌలర్లే మా కొంపముంచారు..
నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో మూడో ఓవర్ నుంచే ప్రత్యర్థి జట్టు ఆధిపత్యం ప్రదర్శించిందని చెప్పుకొచ్చాడు. కొంత మంది బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినప్పటికి కూడా గ్లెన్ ఫిలిప్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని అన్నాడు. అతను ఆడిన కొన్ని షాట్లు చూడటానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయన్నాడు. ఈ సిరీస్ అంతటా అతను నిలకడగా రాణిస్తున్నాడని, అతని నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. బౌలింగ్ వైఫల్యాలపై సమీక్ష చేసుకుని, ఎక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకుంటామని తెలిపాడు. తదుపరి మ్యాచ్‌కు ముందు ఒక రోజు విరామం ఉండటంతో, ఆ సమయంలో తమ ప్రదర్శనపై సమగ్రంగా చర్చించి, లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాడు. హామిల్టన్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్‌లోని మైదానాలు, బౌండరీల కొలతలు ఇలా ఉంటాయనే విషయం తమకు ముందుగానే తెలుసన్నాడు. అయితే.. కొందరు ఆటగాళ్లకు ఇలాంటి మైదానాల్లో ఆడటం ఇదే మొదటిసారని, కాబట్టి పరిస్థితులకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందన్నాడు.
అయినప్పటికి కూడా.. తొలి మూడు మ్యాచ్‌లలో ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని గుర్తు చేశాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో బరిలోకి దిగినప్పుడు ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ఏదీఏమైనప్పటికి కూడా తదుపరి మ్యాచ్‌లో సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతామని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.



