చంద్రబాబు 40 ఏళ్ల ఇమేజ్ గంగలో కలిసింది..!

Must read

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై సీపీఐ జాతీయ నాయకులు రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల నిర్వహణ అత్యంత అధ్వాన్నంగా సాగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేదని, కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని ఆ ఇమేజ్ కాస్తా పూర్తిగా గంగలో కలిసిపోయిందని దుయ్యబట్టారు.

ఈ ఎన్నికల నిర్వహణ విధానం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో అధికార పక్షం కనుసన్నల్లోనే అన్ని అక్రమాలు జరుగుతున్నాయని రామకృష్ణ ఆరోపించారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. మరోవైపు చంద్రబాబు మాత్రం గొప్పలు చెప్తున్నారని, కొందరు ఆయనకు డబ్బా కొడుతున్నారని మండిపడ్డారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన పవన్ కళ్యాణ్, మాధవ్ లు చంద్రబాబుకు భజన చేయడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అధికార పార్టీ చేయాల్సిన పనిని పోలీసులు చేస్తున్నారని, వారు పాలకులకు జీతగాళ్లలా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష అభ్యర్థులను అసలు నామినేషన్లు వేయనివ్వడం లేదని, ఒకవేళ ధైర్యం చేసి నామినేషన్లు వేసినా వాటిని బలవంతంగా విత్ డ్రా చేసినట్లు చూపిస్తూ బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిద్రపోతోందని, అధికార పార్టీ, పోలీసులు, ఎన్నికల సంఘం మూడు వ్యవస్థలూ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. భారత దేశ చరిత్రలోనే ఇంత అధ్వాన్నంగా ఎక్కడా ఎన్నికలు జరగలేదని, ఎన్నికల సంఘం తన బాధ్యత నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని రామకృష్ణ స్పష్టం చేశారు.

The post appeared first on .

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!