Telangana Ration Card: ఎల్నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక సన్నాహాలు చేస్తోంది. వర్షాభావం వల్ల పంటల దిగుబడి తగ్గి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ఈ పరిస్థితుల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలను గట్టెక్కించేందుకు రేషన్(Telangana Ration Card) దుకాణాల ద్వారా బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమ పిండి, పంచదార, పామాయిల్, చింతపండు, కారంపొడి వంటి నిత్యావసర సరుకులను అతి తక్కువ సబ్సిడీ ధరలకే పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది.
14 నెలల ఆహార భద్రతే లక్ష్యం.. పౌరసరఫరాల సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు:
ఇటీవల హైదరాబాద్లోని సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర రవాణా, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పంపిణీ కార్యక్రమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తినా రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత రాకుండా ముందస్తుగా 14 నెలలకు సరిపడా సరుకులను సమేకరించి నిల్వ ఉంచుకోవాలని అధికారులను లక్ష్యంగా నిర్దేశించారు. మిల్లర్లు, ఇతర వనరుల నుంచి రావాల్సిన బియ్యాన్ని సకాలంలో గోదాములకు చేర్చి సరుకుల సేకరణ పూర్తయిన వెంటనే ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ అమల్లోకి.. మార్కెట్ ధరల భారం నుంచి సామాన్యులకు భారీ ఉపశమనం:
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు గోధుమ పిండి, కందిపప్పు, పంచదార, నూనెలను సబ్సిడీపై పంపిణీ చేసే విధానం విజయవంతంగా కొనసాగుతోంది. అదే తరహాలో తెలంగాణలోనూ రేషన్ కార్డుదారులందరికీ కిరాణా సరుకులను పంపిణీ చేయడం ద్వారా సామాన్యుల జేబులకు చిల్లు పడకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.100 వరకు చేరుకోవడం, 25 కిలోల బస్తా రూ.3,000 పలుకుతుండటంతో ప్రభుత్వ నిర్ణయం పేదలకు ఎంతో ఊరట నివ్వనుంది. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం లభించాక అధికారికంగా అమలు తేదీని ప్రకటించనున్నారు.



