- 2027లో బుల్లెట్ ట్రైన్ సందడి.. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు హైస్పీడ్ జర్నీ
- సముద్రం అడుగున రైలు మార్గం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో అద్భుతం
- భూమి లోపల స్టేషన్.. సముద్రం కింద టన్నెల్.. బుల్లెట్ ట్రైన్ స్పెషల్
Mumbai-Ahmedabad Bullet Train : బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్‌కు హైస్పీడ్ జర్నీ చేయొచ్చు.. అతి త్వరలో భారత రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కొత్త బుల్లెట్ ట్రైన్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు నిర్మిస్తున్న హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ మార్గంలో తొలి రైలు సేవలను 2027 చివరి త్రైమాసికంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.. అయితే, పనులు పూర్తవడం, ఇతర ఏర్పాట్లు సిద్ధం కావడంపై ప్రారంభ తేదీ ఆధారపడి ఉంటుంది.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం.. :
ఈ ప్రాజెక్టు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిర్మాణ దశలో ముందుకు సాగుతోంది. మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు దాద్రా అండ్ నగర్ హవేలీ ప్రాంతం గుండా వెళ్తోంది.
ఈ ప్రాజెక్టులో అందరి దృష్టిని ఆకర్షించేది ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) వద్ద నిర్మిస్తున్న భూగర్భ స్టేషన్. భూమికి సుమారు 32 మీటర్ల లోతులో ఏర్పాటు చేస్తున్న ఈ స్టేషన్‌లో 3 స్థాయిలు, 6 ప్లాట్‌ఫారాలు ఉండనున్నాయి. ఒక్కో ప్లాట్‌ఫారం 400 మీటర్లకు పైగా పొడవుతో నిర్మిస్తున్నారు.
ఇక థానే క్రీక్ కింద సుమారు 7 కిలోమీటర్ల పొడవైన రైలు టన్నెల్ నిర్మాణం మరో కీలక ఆకర్షణగా నిలవనుంది. సముద్ర జలాల కింద సాగే ఈ మార్గం భారత హైస్పీడ్ రైలు చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోనుంది.
ఈ బుల్లెట్ ట్రైన్ మార్గంలో ముంబై బీకేసీ, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి సహా 12 ప్రధాన స్టేషన్లు ఉంటాయి. గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైళ్లను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. ముంబై–అహ్మదాబాద్ ప్రయాణంలో సమయం మరింత ఆదా కానుంది.


