IND vs NZ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అభిషేక్ శర్మ (113; 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో 199 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (45; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.
అభిషేక్, వైభవ్ ఇద్దరూ పవర్ ప్లేలో (6 ఓవర్లలో ) 118 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు సృష్టించారు. పోటాపోటీగా బౌండరీలు బాదిన వీరిద్దరు తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 133 పరుగులు జోడించారు. వైభవ్ ఔట్ అయినా కూడా అభిషేక్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. 35 బంతుల్లో సెంచరీ చేశాడు. సరిగ్గా 10వ ఓవర్ చివరి బంతి అభిషేక్ ఔట్ అయ్యాడు. అప్పటికి భారత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 178 పరుగులు. అంటే ఓవర్‌కు 17.8 రన్‌రేట్‌తో టీమ్ఇండియా పరుగులు సాధించింది.
శ్రేయస్ అయ్యర్ (5 ; 10 బంతుల్లో) సంజూ శాంసన్ (18; 13 బంతుల్లో 2 ఫోర్లు) ఔట్ అయినా కూడా నమన్ ధీర్ (4 నాటౌట్; 1 బంతిలో 1 ఫోర్), తిలక్ వర్మ (1 నాటౌట్; 1బంతిలో) లాంఛనాన్ని పూర్తి చేశారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ ఫిషర్, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ తీశారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (89 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్థశతకం చేశాడు. ఫిన్ అలెన్ (40; 25 బంతుల్లో 5 సిక్సర్లు), బెవాన్ జాకబ్స్ (37 నాటౌట్; 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ పడగొట్టారు.


