తీవ్ర రూపం దాల్చిన ‘అర్నబ్’ తుపాను.. భోగాపురం, విజయవాడ నుంచి విమాన సర్వీసులు రద్దు.. వివరాలు ఇవే!

Must read

Cyclone Arnab: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన ‘అర్నబ్’ (Cyclone Arnab) తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ అతి తీవ్ర తుపాను, ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కిమీ, కాకినాడకు 140 కిమీ, మచిలీపట్నానికి 230 కిమీ, బాపట్లకు 300 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం ఉదయానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు.. పోలవరం నుంచి కోనసీమ వరకు విపత్తు హెచ్చరికలు:

తుపాను ప్రభావంతో రాబోయే కొద్ది గంటల్లో పోలవరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత జిల్లాల్లో గాలుల ఉధృతి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, తుపాను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు.

స్తంభించిన విమాన సర్వీసులు.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల రద్దు:

‘అర్నబ్’ తుపాను తీవ్రత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు భారీగా రద్దయ్యాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన 16 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే విజయవాడ విమానాశ్రయం నుంచి మంగళవారం 6 విమానాలు రద్దు కాగా, బుధవారం కూడా ఇండిగోకు చెందిన అన్ని విమానాలు, ఎయిర్ ఇండియా ఢిల్లీ సర్వీసు, ఫ్లై91 సంస్థకు చెందిన రెండు హైదరాబాద్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!