AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ తుఫాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం వేగంగా బలపడుతూ అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (AP Cyclone Alert) హెచ్చరించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను, బుధవారం మధ్యాహ్నానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల అత్యంత వేగంతో విధ్వంసకర ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది.
రంగంలోకి 15 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. తీరప్రాంతాల్లో హైఅలర్ట్:
తుఫాను ప్రభావంతో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ముందస్తుగా 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, శ్రీకాకుళం, బాపట్ల, అల్లూరి, పోలవరం ప్రాంతాల్లో ఈ బృందాలను సిద్ధంగా ఉంచారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
మత్స్యకారులకు తీవ్ర హెచ్చరికలు.. సముద్రంలోకి వెళ్లవద్దని అధికారుల ఆదేశం:
సముద్రం అత్యంత అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటలో ఉన్నవారు వెంటనే సమీప తీరాలకు చేరుకోవాలని, బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని తెలిపారు. తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నందున వీక్షకులు, పర్యాటకులు సముద్రం వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దిగొద్దని స్పష్టం చేశారు. మంగళ, బుధవారాల్లో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అధికారికంగా వెలువడే వాతావరణ బులెటిన్లను మాత్రమే నమ్మాలని కోరారు.


