Sangareddy Accident: సంగారెడ్డి జిల్లా కొల్లూరు సమీపంలోని బాహ్య వలయ రహదారి (Sangareddy Accident)పై శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన వాహనం సృష్టించిన బీభత్సానికి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఓఆర్ఆర్పై ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర ప్రమాదంతో తీవ్ర తీవ్ర కలకలం రేగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్ మధ్యలో ఉన్న డివైడర్ మొక్కలకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్న హెచ్ఎమ్డీఏ/సీఎంసీ కార్మికుడిని, అలాగే వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ ఆటో ట్రాలీ అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆటో ట్రాలీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కొల్లూరు పోలీసులు:
పటాన్చెరు వైపు నుంచి అతివేగంతో వస్తున్న ఆటో ట్రాలీ, డివైడర్ వద్ద మొక్కలకు నీళ్లు పోస్తున్న సీఎంసీ కార్మికుడు శ్రీనివాస్ అలియాస్ వీరును తీవ్రంగా ఢీకొట్టి, ఆ వెంటనే ముందనున్న వాటర్ ట్యాంకర్‌ను బలంగా గుద్దింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన కార్మికుడు శ్రీనివాస్‌తో పాటు ఆటో ట్రాలీ డ్రైవర్ శ్రీనాథ్ తీవ్ర రక్తస్రావమై స్పాట్లోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.


