Rahul Gandhi: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోషల్ మీడియా వేదికగా బీజేపీ, దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. విపక్షాల కంటే ఎక్కువగా తమ నిరసన ర్యాలీకి అధికార పార్టీ నాయకులే పబ్లిసిటీ కల్పిస్తున్నారని, ఇంతటి ఉత్సాహంతో ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడు రోజులు కూడా బీజేపీ ఇదే అంకితభావాన్ని కొనసాగించాలని చురకలంటించారు.
విద్యార్థులు, రైతులు, కార్మికులకు రాహుల్ పిలుపు:
దేశంలో ఓటర్ల జాబితాల నుంచి కోట్లాది మంది పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీఛార్జ్ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దేశ ప్రజల ఓట్లను దొంగిలిస్తున్న పరిణామాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. “ఓటు మీది, పోరాటం కూడా మీదే” అని పిలుపునిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ఢిల్లీకి తరలిరావాలని కోరారు.
10 లక్షల మందితో ‘మహా ర్యాలీ’.. దేశ రాజధానిలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అమిత్ షా:
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు, ఎంపీలు అక్టోబర్ 30 నుండి నవంబర్ 1 వరకు ఢిల్లీలోనే అందుబాటులో ఉండనున్నారు. దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలు, మద్దతుదారులతో రామ్‌లీలా మైదానంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ భారీ ప్రదర్శన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఢిల్లీ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.


