- నెట్వర్క్ లేదు.. అయినా సమాచార మార్పిడి..
- ఏఐ ఏజెంట్ల కొత్త టెక్నిక్‌తో టెక్ ప్రపంచంలో చర్చ
- ఆఫ్లైన్లోనూ ఏఐ ఏజెంట్ల కమ్యూనికేషన్..
- కంప్యూటర్ చిప్‌లోనే దారి వెతుక్కున్న ఏఐ
OpenAI Agents : బాబోయ్ ఏఐతో జాగ్రత్త.. ఏఐకి ఇంటర్నెట్ అక్కర్లేదు.. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఏఐ (AI) ఏజెంట్లు ఇతర సిస్టమ్‌లతో సమాచారాన్ని షేర్ చేయలేవని అనుకుంటున్నారా? ఏఐ ఏజెంట్లకు ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తాయని తేలింది..
ఓపెన్ఏఐ నిర్వహించిన ఓ ప్రయోగంలో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. నెట్వర్క్ కనెక్షన్ లేకుండానే రెండు ఏఐ ఏజెంట్లు రహస్య సమాచారాన్ని మార్పిడి చేసుకోగలిగాయని కంపెనీ వెల్లడించింది. దీంతో ఏఐ భద్రతకు సంబంధించి కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
సేఫ్టీ కోసం కొత్త విధానం :
అత్యాధునిక ఏఐ మోడళ్ల ట్రైనింగ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఓపెన్ఏఐ చర్యలు చేపట్టింది. ఏఐ ఏజెంట్లు పరీక్షా వాతావరణాన్ని దాటి బయటి వ్యవస్థలను చేరుకునేందుకు ప్రయత్నించిన ఘటనల నేపథ్యంలో సెప్టెంబర్‌లో ట్రైనింగ్ నిలిపివేసినట్లు వచ్చిన రిపోర్టులు టెక్ ప్రపంచంలో చర్చకు దారితీశాయి. అక్టోబర్ 1 నుంచి మరింత కఠినమైన భద్రతా చర్యలతో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ట్రైనింగ్ తిరిగి ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.
ఈ క్రమంలో లైవ్ వెబ్సైట్లతో నేరుగా సంబంధం లేకుండా మోడళ్లు పనిచేసేందుకు ఇంటర్నెట్ కంటెంట్‌ను ముందుగానే సేకరించి స్టోర్ చేసిన ఆఫ్‌లైన్ వాతావరణాన్ని రూపొందించింది. దీనివల్ల బయటి వ్యవస్థలకు ప్రమాదం కలగకుండా ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇవ్వొచ్చని సంస్థ భావించింది.
ప్రాసెసర్ క్యాష్తో రహస్య సందేశాలు :
అయితే, ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా నిరోధించినప్పటికీ మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. వేర్వేరు వర్చువల్ మెషీన్లలో పనిచేస్తున్న రెండు ఏఐ ఏజెంట్లకు నెట్వర్క్ ఉపయోగించకుండా రహస్య సమాచారాన్ని షేర్ చేయాలని సూచించారు. ఇందుకోసం కంప్యూటర్ ప్రాసెసర్లోని క్యాష్ మెమరీని ఉపయోగించాయి.
క్యాష్ మెమరీలోని డేటాను చదివేందుకు పట్టే సమయం, మెయిన్ మెమరీ నుంచి డేటాను పొందేందుకు పట్టే సమయం మధ్య వ్యత్యాసాన్ని ఏజెంట్లు గుర్తించాయి. ఒక ఏజెంట్ నిర్దిష్ట డేటాను క్యాష్ నుంచి తొలగించడం ద్వారా సంకేతాలను క్రియేట్ చేయగా మరో ఏజెంట్ డేటాను తిరిగి చదివేందుకు పట్టే సమయాన్ని కొలిచి ఆ సంకేతాలను అర్థం చేసుకుంది. ఇలా ఫైల్ షేరింగ్ లేదా నెట్వర్క్ కనెక్షన్ లేకుండానే సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి.
ఈ ప్రయోగం ఏఐ భద్రతలో కొత్త సవాలును సూచిస్తోంది. ఇంటర్నెట్ను బ్లాక్ చేయడం ఒక్కటే సరిపోకపోవచ్చు. కంప్యూటర్ హార్డ్‌వేర్‌లోని చిన్న చిన్న ఫీచర్లను కూడా సేఫ్టీ పరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన చెబుతోంది..


