Home Minister Anitha: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సోమవారం నుంచి కోస్తాంధ్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన విస్తారమైన వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ సంకేతాలు ఇవ్వడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. గంటకు 125 కి.మీ వేగంతో వీచనున్న గాలులు:
వాతావరణ అధికారుల అంచనా ప్రకారం, ఈ తుపాను బుధవారం నాటికి బాపట్ల, విశాఖపట్నం తీర ప్రాంతాల మధ్య తీరం దాటే ప్రమాదం ఉందని హోంమంత్రి తెలిపారు. ఆ సమయంలో గంటకు 115 నుండి 125 కిలోమీటర్ల భయంకర వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ప్రమాదకరమైన భారీ హోర్డింగులను వెంటనే తొలగించాలని, తీర ప్రాంత లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను పురమాయించారు.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. ప్రజలకు హోంమంత్రి కీలక విజ్ఞప్తి:
ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, కంట్రోల్ రూమ్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసర పుకార్లను నమ్మవద్దని, కేవలం విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అందించే అధికారిక నివేదికల ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


