Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లోని మాంసప్రియులకు పండుగల సీజన్ సందర్భంగా గట్టి షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న చికెన్ ధరలు ఈ వారం మరింతగా ఎగబాకాయి. పండుగల సందర్భంగా డిమాండ్ విపరీతంగా పెరగడం, పౌల్ట్రీ ఉత్పత్తి తగ్గి సరఫరాలో జాప్యం ఏర్పడటమే ఈ సడన్ హైక్‌కు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్లెస్ చికెన్ (Chicken Price Hike)ధర రూ. 290 నుంచి రూ. 300 వరకు చేరుకోగా, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లోనూ రూ. 300 మార్కును తాకింది. ఏపీలోని విజయవాడలో ఏకంగా రూ. 310 వద్ద విక్రయాలు జరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాన్ వెజ్ మార్కెట్లలో ఆదివారం రద్దీ.. మటన్, కోడిగుడ్ల రేట్లకు కూడా రెక్కలు:
చికెన్‌తో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండే కోడిగుడ్లు, మటన్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కేజీ మటన్ ధర రూ. 800 నుండి రూ. 1100 వరకు పలుకుతుండగా, హైదరాబాద్, విజయవాడ జోన్లలో 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ. 80కు చేరుకుంది. ఇవాళ ఆదివారం కావడంతో పండుగ వేళ నాన్ వెజ్ వండుకోవాలని భావించిన ప్రజలు ఉదయం నుంచే మార్కెట్లలోని చికెన్, మటన్ సెంటర్ల వద్ద భారీగా బారులు తీరారు. పెరిగిన ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.
మున్ముందు మరిన్ని భారం.. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం:
పౌల్ట్రీ రవాణా వ్యయం పెరగడం, ఫారాల్లో కోళ్ల ఉత్పత్తి మందగించడంతో పండుగల రద్దీ తీరేవరకు ధరల మంట తగ్గేలా లేదని పౌల్ట్రీ యజమానులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో దసరా, దీపావళి వరుస పండుగలు ఉండటంతో చికెన్, కోడిగుడ్ల రేట్లు మరిన్ని రికార్డులను తాకే అవకాశముందని భావిస్తున్నారు. పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో పాటు నాన్ వెజ్ రేట్లు కూడా ఊహించని రీతిలో పెరగడంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


