- తుఫాను ముప్పు పొంచి ఉందా? ఏపీ ప్రజలు ఇవి అస్సలు చేయొద్దు
- ఈదురుగాలులు, భారీ వర్షాల వేళ.. మీ కుటుంబ భద్రతమే ముఖ్యం
- తుఫాను వస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- సముద్రం అల్లకల్లోలం.. మత్స్యకారులకు కీలక హెచ్చరిక
AP Cyclone Alert : ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు, వరదలతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణాపాయం కూడా తప్పదు..
అందుకే తుఫాను తీరం దాటేవరకు వేచి చూడకుండా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం ఎంతైనా మంచిది. వాతావరణ పరిస్థితులపై అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
తుఫానుకు ముందే ఇలా చేయండి :
తుఫాను వస్తుందనే సమాచారం అందిన వెంటనే సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలను అసలు నమ్మకూడదు. అధికారిక హెచ్చరికలను మాత్రమే అనుసరించాలి. మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలి. టార్చ్‌లైట్, అవసరమైన మందులు, ప్రథమ చికిత్స సామగ్రి, పొడి ఆహారం, తాగునీటిని రెడీగా పెట్టుకోవాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లను వాటర్‌ప్రూఫ్ కవర్లలో భద్రపరచాలి.
ఇంటి పైకప్పులు, రేకుల షెడ్లు బలంగా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోండి.. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. కనీసం వారం రోజులకు సరిపడా నిత్యావసరాలను అందుబాటులో ఉంచుకోవడం బెటర్..
తుఫాను సమయంలో చేయకూడని తప్పులివే :
ఇంట్లో ఉన్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. గ్యాస్ కనెక్షన్‌ను సేఫ్‌గా ఆపాలి. తలుపులు, కిటికీలను గట్టిగా మూసి ఉంచాలి. భవనం దెబ్బతినే ప్రమాదం కనిపిస్తే అక్కడే ఉండకుండా సురక్షిత ఆశ్రయానికి వెళ్లాలి. బయట ఉన్నవారు చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలి. గాలి వేగం తగ్గినంత మాత్రాన ప్రమాదం తొలగిపోయిందని భావించి బయటకు రావద్దు.
తుఫాను తర్వాత జాగ్రత్తలివే :
వరద నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. అందుకే కాచి చల్లార్చిన లేదా సురక్షితంగా శుద్ధి చేసిన నీటినే తాగాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకొద్దు.. తడిసిన విద్యుత్ పరికరాలను నిపుణులు చెక్ చేసిన తర్వాతే వాడాలి. అధికారులు సురక్షితమని ప్రకటించే వరకు ఆశ్రయ కేంద్రాలను విడిచిపెట్టరాదు..
మత్స్యకారులకు కీలక హెచ్చరిక :
సముద్రం అల్లకల్లోలంగా ఉండే సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు.. పడవలను సురక్షితంగా ఒడ్డున కట్టి ఉంచాలి. వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలి. అప్రమత్తత, ముందస్తు ప్రణాళిక, అధికారుల సూచనలను పాటిస్తే తుఫాను ముప్పును ఈజీగా ఎదుర్కోవచ్చు.


