Ponguleti Srinivasa Reddy: తెలంగాణలోని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) కీలక ప్రకటన చేశారు. కుడా (KUDA) పరిధిలోని నియోజకవర్గాలను ప్రామాణిక యూనిట్లుగా తీసుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగా మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
భూముల సేకరణపై కలెక్టర్లకు ఆదేశాలు.. తొలి విడతతో పాటు తదుపరి దశలకు సన్నాహాలు:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. తొలి విడతకే కాకుండా రెండు, మూడో విడతల్లో నిర్మించబోయే ఇళ్లకు కూడా ముందుగానే అనువైన స్థలాలను గుర్తించి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే, నిర్మాణాలకు అనుకూలంగా ఉండేలా భూముల లభ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపిక.. యూట్యూబ్లో లైవ్ డ్రా ప్రసారం:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఈ డ్రా ప్రక్రియ మొత్తాన్ని ప్రజలందరూ చూసేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, తదుపరి పరిశీలన కోసం వివరాలను యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.


