- దీపావళి వేళ గుడ్ న్యూస్..
- బాణసంచా కాల్చేటప్పుడు ప్రమాదమా?
- రూ. 11కే రూ.25 వేల వరకు వైద్య కవరేజ్..
- ఫోన్‌పే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలంటే?
PhonePe Firecracker Insurance : దీపావళి వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ దీపాల వెలుగులతో మెరిసిపోతాయి. పిల్లలు, పెద్దలు క్రాకర్స్ కాల్చుతూ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, టపాసులు కాల్చే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా గాయాలకు దారితీయొచ్చు. ప్రతి ఏడాది దీపావళి సమయంలో క్రాకర్స్ కాల్చుతూ పిల్లల నుంచి పెద్దల వరకు గాయాలపాలవుతున్నారు.
అందుకే ఇలాంటి ప్రమాదాల వేళ వైద్య ఖర్చుల భారం కొంత తగ్గించుకునేందుకు ఫోన్‌పే ఓ స్పెషల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. కేవలం రూ.11 నుంచే ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎలా కొనుగోలు చేయాలి? ఏయే ప్రమాదాలకు కవరేజ్ ఉంటుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రూ.11కే ఇన్సూరెన్స్.. రెండు ప్లాన్లు :
ఫోన్‌పేలో ఈ ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. ఇందులో 2 రకాల ప్లాన్లు ఉన్నాయి. 11 రోజుల ప్లాన్ ధర రూ.11 కాగా, 30 రోజుల ప్లాన్ ధర రూ.21. 30 రోజుల ప్లాన్ అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చింది. 11 రోజుల ప్లాన్ నవంబర్ 5 నుంచి అందుబాటులోకి రానుంది.
రూ.25 వేల వరకు వైద్య ఖర్చులకు కవరేజ్ :
ఈ పాలసీ ద్వారా అర్హత ఉన్న ఆస్పత్రి ఖర్చులకు గరిష్ఠంగా రూ.25వేల వరకు కవరేజ్ లభిస్తుంది. బాణసంచా ప్రమాదాల కారణంగా ఆస్పత్రిలో 24 గంటలకు మించి చికిత్స పొందాల్సి వచ్చినప్పుడు నిబంధనల ప్రకారం ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు. 24 గంటల్లో పూర్తయ్యే కొన్ని చికిత్సలు, కాలిన గాయాలకు చేసే అర్హత ఉన్న డే-కేర్ చికిత్సలకు కూడా కవరేజ్ అందుతుంది.
ఈ వైద్య ప్రయోజనాలు పాలసీదారుతో పాటు జీవిత భాగస్వామి, గరిష్ఠంగా ఇద్దరు ఆధారపడిన పిల్లలకు వర్తిస్తాయి. ప్రమాదవశాత్తూ పాలసీదారు మరణిస్తే, నిబంధనలకు లోబడి రూ.25వేలు ప్రమాద బీమా అందుతుంది. అయితే, ప్రతి ప్రమాదానికి రూ.25,000 వస్తుందని భావించకూడదు. పాలసీ నిబంధనలు, మినహాయింపులు, క్లెయిమ్ అర్హతలను బట్టి ప్రయోజనాలు ఉంటాయి.
ఫోన్‌పేలో ఎలా కొనాలి?
- ముందుగా ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి Insurance సెక్షన్లోకి వెళ్లాలి.
- అక్కడ Firecracker Insurance ఆప్షన్ ఎంచుకోవాలి.
- అందుబాటులో ఉన్న ఆయా ప్లాన్‌ను ఎంచుకోవాలి.
- కవరేజ్ వివరాలు, బీమా సంస్థ నిబంధనలను చెక్ చేయండి.
- 30-రోజుల వేరియంట్‌కు ప్రీమియం రూ. 21 చెల్లించాలి.
- 11-రోజుల వేరియంట్‌కు రూ. 11 చెల్లిస్తే సరిపోతుంది.
- ప్రతి పాలసీకి కవరేజ్ టైమ్, నిబంధనలు, కొనుగోలు తేదీపై ఆధారపడి ఉంటుంది.
- అవసరమైన వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
పాలసీ తీసుకునే ముందు కవరేజ్ ప్రారంభ, ముగింపు తేదీలు, క్లెయిమ్‌కు అవసరమైన డాక్యుమెంట్లు, రీయింబర్స్మెంట్ ప్రాసెస్, మినహాయింపులను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇన్సూరెన్స్ ఉన్నా, బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.


