Amit Mishra : టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ అమిత్ మిశ్రా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత జట్టుకు దూరమైన మిశ్రా.. అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేలు తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని అన్నాడు. ఆ మ్యాచ్‌లో గాయపడకపోయి ఉంటే తాను మరికొన్ని ఏళ్లపాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించేవాడినని చెప్పుకొచ్చాడు.
మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పాడ్‌కాస్ట్‌లో అమిత్ మిశ్రా మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. బెంగళూరులో జరిగిన ఆ మ్యాచ్ సమయంలో తాను గాయపడి వెళ్తున్నప్పుడు కోచ్ అనిల్ కుంబ్లే తన వద్దకు వచ్చి.. ‘నువ్వు గాయం నుంచి కోలుకోగానే నేరుగా జట్టులోకి వచ్చేస్తావ్, ఎలాంటి ఆందోళన చెందొద్దు’ అని ధైర్యం చెప్పారని మిశ్రా గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీని కూడా తాను సంప్రదించినట్లు మిశ్రా తెలిపాడు. కోహ్లీ కూడా కుంబ్లే లాగే మాట్లాడారని, ‘పూర్తిగా కోలుకుని ఫిట్‌గా ఉండు, జట్టులో నీ స్థానం ఖాయం’ అని హామీ ఇచ్చారని వెల్లడించాడు. ఈ మాటలతో తాను పూర్తి ఫిట్నెస్ సాధించడంపై దృష్టి సారించి త్వరగానే మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యానని పేర్కొన్నాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత టీమ్‌లోకి పునరాగమనం గురించి విరాట్ కోహ్లీకి మెస్సేజ్ పంపినట్లు మిశ్రా చెప్పాడు. దానికి కోహ్లీ వారం లేదంటే పది రోజుల్లో చెబుతానని సమాధానమిచ్చాడని, కానీ ఆ తర్వాత ఎన్నిరోజులకూ అతని నుంచి ఎలాంటి సమాచారం రాలేదని మిశ్రా తెలిపాడు. దాంతో తాను కోహ్లీకి వరుసగా ఫోన్లు, మెసేజ్‌లు చేసినా అతడు ఏమాత్రం స్పందించలేదని మిశ్రా ఆరోపించాడు.
తీవ్రమైన గాయాలతో నెలల తరబడి జట్టుకు దూరమైన మిగతా ఆటగాళ్లకు ఫిట్నెస్ సాధించగానే తిరిగి అవకాశం ఇచ్చారని, కానీ, తన విషయంలో మాత్రం ఆ నియమాన్ని పాటించలేదని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా మనల్ని జట్టులో వద్దనుకున్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం. అందుకే నేను కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాను. కానీ, ఈ ప్రశ్నకు నేటికీ నాకు సమాధానం దొరకలేదని మిశ్రా తన బాధను వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2027 సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ గా నియమించింది. దీంతో ఐపీఎల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఢిల్లీ జట్టుతోనే మిశ్రా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నాడు. 43ఏళ్ల మిశ్రా 2025 సెప్టెంబర్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోచ్‌గా ఐపీఎల్లో బాధ్యతలు చేపట్టడం అతడికి ఇదే తొలిసారి.


