Megastar Chiranjeevi : మెగాస్టార్ రాబోయే సినిమాలపై పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది ఇండస్ట్రీలో. గత సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ అనే సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన మెగాస్టార్ ఈ సంక్రాంతికి కూడా కర్చీఫ్ వేసి కాకా సినిమాతో వద్దామని ప్లాన్ వేశారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అదిరింది, సినిమాపై హైప్ కూడా ఉంది. షూటింగ్ కూడా ఫాస్ట్ గానే జరుగుతుంది. సంక్రాంతికి అని రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
కానీ కాకా సంక్రాంతి బరిలో ఉండదనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం విశ్వంభర. అప్పుడెప్పుడో 2023 లో ఈ సినిమా అనౌన్స్ చేసారు. 2024 లో షూటింగ్ జరిగింది. ఒక పాట కూడా రిలీజ్ చేసారు. టీజర్ వచ్చింది, అందులో గ్రాఫిక్స్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. అప్పట్నుంచి ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.
Also Read : Jabardasth Dorababu : జబర్దస్త్ దొరబాబు ఫ్యామిలీని చూశారా..? భార్య, కూతురుతో ఫోటోలు..
ఇప్పటికే అధికారికంగా, అనధికారికంగా విశ్వంభర రిలీజ్ విషయంలో చాలా డేట్స్ వినిపించాయి. కానీ ఆ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు. VFX సరిగ్గా రాలేదు, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవలేదు, దర్శకుడు మారాడు.. ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వంభర సినిమాని సంక్రాంతి పండగకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట.
కాకా సినిమా పూర్తవడానికి ఇంకాస్త టైం పడుతుందని అందుకే విశ్వంభరని త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారట. ఒకవేళ సినిమా అటు ఇటుగా ఉన్నా పండగ సీజన్ లో నడిచిపోతుంది, కలెక్షన్స్ వస్తాయి కాబట్టి మెగాస్టార్ కూడా విశ్వంభర రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారట. అయితే కాకా సినిమా ఆ టైం వరకు రెడీ అవ్వకపోతేనే విశ్వంభర రిలీజ్ అవుతుంది. లేదా కాకానే రిలీజ్ చేస్తారట. మరి రాబోయే సంక్రాంతికి బాస్ నుంచి ఏ సినిమా వస్తుందో చూడాలి.


