Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. సాగునీటి కొరతతో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమించగా దక్షిణ భారతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులతో రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవాళ (శుక్రవారం) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులతో కూడిన వాతావరణ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఏపీలో పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణంతోపాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇవాళ విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పోలవరం, విశాఖపట్టణం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు వర్షాలు, ఈదురుగాలుల సమయంలో పొలాల్లో, చెట్ల కింద ఉండొద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ప్రస్తుతం ఏపీలో వర్షాలు లేక రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రతతో నీటి కొరత ఏర్పడంతో వర్షాలకోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశంఉన్న నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే అవకాశం ఉంది.


