Thursday, September 3, 2026

Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..

Must read

Pakistan Hindu Temple Demolition India Condemns Destruction Of Century Old Temple

Pakistan:  పాకిస్తాన్‌లోని నరోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో శతాబ్ధానికి పైబడిన పురాతన హిందూ ఆలయం కూల్చివేతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు 21న ఈ ఆలయం కూల్చివేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. సిరాజ్ గ్రామంలోని చారిత్రక హిందూ ఆలయం ధ్వంసమైనట్లు వచ్చిన వార్తలను తీవ్ర ఆందోళనతో గమనించామని తెలిపారు. శతాబ్దం నాటి మైనారిటీ ప్రార్థనా స్థలంపై జరిగిన ఈ విధ్వంసాన్ని భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఆలయాన్ని రక్షించడంలో పాకిస్తాన్ అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఘటనపై వెంటనే పారదర్శక దర్యాప్తు చేపట్టి బాధ్యులను పూర్తిగా జవాబుదారీ చేయాలని పాక్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ధ్వంసమైన ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వివాదంపై పాకిస్తాన్ మైనారిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసినట్లు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న మదర్సా విస్తరణ కోసం ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు. పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ (PMMP) అధ్యక్షుడు అస్లాం పర్వేజ్ సాహోత్రా ఈ ఘటనపై ప్రభుత్వ జోక్యం కోరారు. ఆగస్టు 28న పంజాబ్ అదనపు హోం కార్యదర్శిని కలిసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆలయానికి సంబంధించిన భూమిని సమీపంలోని మదర్సాలో కలిపేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని ఆ పార్టీ పేర్కొంది.

ఆలయ శిఖరానికి సంబంధించిన లోహం, ఇతర నిర్మాణ సామగ్రి, శిథిలాల్లోని ఇటుకలను కూడా కూల్చివేత అనంతరం అక్కడి నుంచి తరలించినట్లు అస్లం పర్వేజ్ సహోత్రా ఆరోపించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని గతంలో ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ETPB) మదర్సా కోసం లీజుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే కొన్నేళ్ల పాటు అద్దె చెల్లించకపోవడం, నిర్దేశిత ప్రయోజనం కోసం భూమిని వినియోగించకపోవడంతో ఆ లీజును రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కొందరు వ్యక్తులు ఆస్తిలోని కొన్ని ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అయితే, పాకిస్తాన్ అధికారులు మాత్రం దీనికి భిన్నమైన వాదనల్ని వినిపిస్తున్నారు. ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చలేదని, భారీ వర్షాల కారణంగా నిర్మాణం దెబ్బతిని కూలిపోయిందని చెబుతున్నారు.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!