Thursday, September 3, 2026

High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు

Must read

Karnataka Hc Daughter In Law Maintenance In Laws Son Death Senior Citizens Act

కొడుకు మరణించినంత మాత్రాన అత్తమామలను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత కోడలిపై కొత్తగా ఏర్పడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం కోడలు అనే బంధం కారణంగా వృద్ధులైన అత్తమామల భరణ బాధ్యతను ఆమెపై మోపలేమని తేల్చి చెప్పింది. అయితే వృద్ధుడు తన ఆస్తిని కోడలికి బహుమతిగా ఇచ్చే సమయంలో.. ఆమె తన ప్రాథమిక అవసరాలు, శారీరక అవసరాలను చూసుకోవాలనే షరతు విధించి ఉంటే మాత్రం.. ఆ బాధ్యతను ఆమె నిర్వర్తించకపోతే మాత్రం 2007 నాటి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టంలోని సెక్షన్ 23 వర్తించే అవకాశం ఉందని కోర్టు వెల్లడించింది

అసలు కేసు ఏంటి?

ఒక వృద్ధురాలు తన ఆస్తిని కోడలికి గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసింది. ఆ తర్వాత మోసం జరిగిందని ఆరోపిస్తూ సివిల్ కోర్టును ఆశ్రయించింది. అయితే గిఫ్ట్ డీడ్ చెల్లుబాటవుతుందని సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ వృద్ధురాలు 2007 నాటి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టంలోని సెక్షన్ 23 కింద సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆస్తిని కోడలికి బదిలీ చేసే సమయంలో తనను చూసుకోవాలనే షరతు ఉందని.. అయితే కోడలు తనను పోషించడం, సంరక్షించడం లేదని ఆమె ఆరోపించింది.

కోడలు కావడం ఒక్కటే కారణం కాదు

ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టంలోని సెక్షన్ 2(a) ప్రకారం ‘పిల్లలు’ అనే నిర్వచనంలో కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాలు ఉంటారని.. కోడలు ఉండదని పేర్కొంది. అయితే అంత మాత్రాన సెక్షన్ 23 కోడలికి వర్తించదని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే సెక్షన్ 23 కేవలం పిల్లల గురించి కాకుండా.. వృద్ధుడు తన ఆస్తిని ఎవరికి బదిలీ చేశాడో ఆ ‘ట్రాన్స్‌ఫరీ’ గురించి కూడా మాట్లాడుతుందని వివరించింది. అంటే కోడలు కూడా ఆస్తి పొందిన వ్యక్తిగా సెక్షన్ 23 పరిధిలోకి రావచ్చు. కానీ ఆమె అత్తమామలకు భరణం ఇవ్వాల్సిన బాధ్యత కేవలం బంధుత్వం వల్ల ఏర్పడదు. ఆస్తి బదిలీ సమయంలో తనను చూసుకోవాలనే షరతు విధించినట్లు నిరూపించాల్సి ఉంటుంది.

సెక్షన్ 23 వర్తించాలంటే ఏం నిరూపించాలి?

సెక్షన్ 23 వర్తించాలంటే రెండు అంశాలు తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.

1. వృద్ధుడు ఆస్తిని బదిలీ చేసేటప్పుడు.. ఆస్తిని పొందిన వ్యక్తి తన ప్రాథమిక, శారీరక అవసరాలను తీర్చాలనే షరతు ఉండాలి.

2. ఆస్తి పొందిన వ్యక్తి ఆ తర్వాత ఆ బాధ్యతను నిర్వర్తించకుండా నిరాకరించి ఉండాలి లేదా విఫలమై ఉండాలి. ఈ షరతు గిఫ్ట్ డీడ్‌లో స్పష్టంగా రాసి ఉండాల్సిన అవసరం ప్రతిసారీ ఉండకపోవచ్చని కోర్టు పేర్కొంది. డీడ్‌తో పాటు అదే సమయంలో రూపొందించిన ఇతర పత్రాలు, పరిసర పరిస్థితులను పరిశీలించి అలాంటి షరతు ఉందని నిర్ధారించవచ్చని తెలిపింది. అయితే గిఫ్ట్ డీడ్‌లో కేవలం ‘ప్రేమ, ఆప్యాయత’ వంటి పదాలు ఉన్నాయనే కారణంతో వాటిని భరణ బాధ్యతగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

కొడుకు మరణిస్తే పరిస్థితి మారుతుందా?

ఈ కేసులో వృద్ధురాలి కుమారుడు.. అంటే కోడలి భర్త, ఆ తర్వాత మరణించాడు. అయితే కొడుకు మరణం కారణంగా కోడలిపై కొత్తగా భరణ బాధ్యత ఏర్పడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి బదిలీ సమయంలోనే గిఫ్ట్ డీడ్‌లో అత్తను పోషించాలనే చట్టబద్ధమైన షరతు ఉంటే.. కొడుకు మరణించిన తర్వాత కూడా ఆ బాధ్యత కొనసాగుతుంది. కానీ ఆస్తి బదిలీ సమయంలో అలాంటి షరతే లేకపోతే.. కొడుకు మరణించిన తర్వాత దాన్ని కొత్తగా సృష్టించలేమని కోర్టు పేర్కొంది. అంటే కోడలిపై భరణ బాధ్యత కేవలం అత్తమామలతో ఉన్న బంధం లేదా భర్త మరణం వల్ల కాకుండా.. ఆస్తి బదిలీ సమయంలో విధించిన చట్టబద్ధమైన షరతు నుంచి ఉత్పన్నమవుతుంది.

ట్రిబ్యునల్ ఉత్తర్వు రద్దు

ఈ కేసులోని గిఫ్ట్ డీడ్‌లో వృద్ధురాలిని పోషించాలనే స్పష్టమైన షరతు లేదని హైకోర్టు గుర్తించింది. అలాంటి బాధ్యత ఉన్నట్లు నిరూపించే ఇతర విశ్వసనీయ ఆధారాలు కూడా లేవని పేర్కొంది. దీంతో సెక్షన్ 23 కింద సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుతో.. కొడుకు మరణించిన తర్వాత కోడలిపై అత్తమామల భరణ బాధ్యత ఎప్పుడు వర్తిస్తుంది? అనే అంశంపై కీలక స్పష్టత లభించింది.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!