ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సు వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘనంగా స్వాగతించారు. వేలాది మంది రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీగా పాల్గొన్నారు.
సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ధరణి వ్యవస్థ వల్ల రైతులు భూములపై యాజమాన్య హక్కులను కోల్పోయారు. కొంతమంది అధికారులను బెదిరించి వేలాది ఎకరాలు ఆక్రమించారు. ధరణి వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు,” అని అన్నారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు భూమిపై పక్కా హక్కులు లభిస్తాయని ఆమె తెలిపారు. “రైతుకు భూమి అనేది ఆత్మగౌరవం. భూభారతి చట్టం రైతుకు భరోసా, భద్రత కల్పిస్తుంది,” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. పంట రుణాల మాఫీ, సన్న వడ్లకు కింటాకు ₹500 బోనస్, ఉచితంగా సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఏడాదిలో 59 వేల ఉద్యోగాల భర్తీ వంటి పథకాల గురించి వివరించారు. చివరగా, “రైతులకు న్యాయం జరిగేలా అధికారులు పారదర్శకంగా పనిచేయాలి,” అని మంత్రి సీతక్క తెలిపారు. భూభారతి చట్టం ద్వారా రైతులు ఇక భూమిపై పూర్తి హక్కుతో, నిశ్చింతగా జీవించగలగతారన్న నమ్మకం ప్రజల్లో పెరిగింది అని మంత్రి సీతక్క పేర్కొన్నారు