త్వరలోనే చార్జీలను పెంచేందుకు సమాయత్తం అవుతోన్న మెట్రో

333

విద్యుత్‌ చార్జీల భారాన్ని బూచిగా చూపుతూ త్వరలో మెట్రో ధరలను పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో రైలు నిర్వహణ భారంగా మారుతున్న నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. చార్జీల పెంపు అంశాన్ని హైదరాబాద్‌ మెట్రోరైలు వర్గాలు మాత్రం ధ్రువీకరించడం లేదు.

విద్యుత్‌ చార్జీల భారం గుదిబండగా మారిన నేపథ్యంలో సంస్థ రూకల్లోతు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం రోజుకు సరాసరిన రూ.50 లక్షల నష్టంతో నెట్టుకొస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం కోవిడ్‌ కలకలం నుంచి తేరుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో పెరగలేదని నిర్మాణ సంస్థ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం మూడు మార్గాల్లో 4.5 లక్షల ప్రయాణికులతో కళకళలాడిన మెట్రో రైళ్లు.. ప్రస్తుతం 3 లక్షల మందితోనే రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యధికంగా నాగోల్‌–రాయదుర్గం, ఎల్బీనగర్‌– మియాపూర్‌ రూట్లో 1.40 లక్షల చొప్పున ప్రయాణికులు మెట్రోలో జర్నీ చేస్తున్నారు. గతంలో మెట్రో నిర్మాణానికి తీసుకున్న రుణాలు,వాటిపై వడ్డీలు, నిర్వహణ ఖర్చులకు తోడు విద్యుత్‌ చార్జీలు భారంగా మారిన నేపథ్యంలో ఆ భారం ప్రయాణికులపై వేయక తప్పదన్న భావన మెట్రోరైలు వర్గాల్లో వ్యక్తమవుతోంది. మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు పెరగడం, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీల భారానికి తోడు కరెంట్‌ చార్జీల పిడుగు నేపథ్యంలో ప్రయాణికులపై భారం మోపక తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మెట్రోలో కనిష్ట చార్జీ రూ.10 కాగా.. గరిష్టంగా రూ.60 వసూలు చేస్తున్నారు. రోజురోజుకూ నిర్వహణ భారంగా మారుతున్న నేపథ్యంలో ఛార్జీల పెంపు అనివార్యమౌతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here