ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడంతో ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌కు మార్గం సుగమమైంది. కరోనా మహమ్మారి కారణంగా 2020 టీ20 వరల్డ్‌కప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. ప్రపంచకప్‌ వాయిదా పడుతుందని ముందుగానే అంచనా వేసిన బీసీసీఐ ఐపీఎల్‌ తేదీలు, వేదికను ఖరారు చేసింది. కరోనా వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన ఈ ఏడాది సీజన్‌ను సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏ క్షణమైనా ఐపీఎల్‌ తేదీలు, వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించొచ్చని సమాచారం. ఐతే ఆటగాళ్ల వీసాలు, ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది.

మొత్తం 44 రోజుల వ్యవధిలో 60 మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలు, ప్రసారదారు స్టార్‌ ఇండియాకు బీసీసీఐ తెలియజేసింది. అయితే దీపావళి(నవంబర్‌ 14) వరకు టోర్నీని పొడిగిస్తే వీక్షణలు పెరగడంతో పాటు ప్రకటనల ధర కూడా అధికంగా ఉంటుందని స్టార్‌ ఇండియా భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటించాల్సి ఉన్నందున సీజన్‌ పొడిగింపు కష్టమేనని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. డిసెంబర్‌ 3వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్‌ టెస్టు సిరీస్‌ మొదలవ్వాల్సి ఉంది. కాగా వచ్చే వారం జరిగే ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఐపీఎల్‌ తుది షెడ్యూల్‌ వేదిక తదితర అంశాలపై ఆ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments