కొన్ని పాటలు వింటే పదే పదే వినాలనిపిస్తుంటాయి . ఈ విషయంలో సాహిత్యం,సంగీతం ముఖ్య భూమిక పోషిస్తాయి . ఆ సాహిత్యం చూస్తే “ఎం రాసావ్ గురూ” అని అనాలనిపిస్తుంది . అయితే అటువంటి సందర్భమే మళ్ళీ వచ్చింది ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న “30 రోజుల్లో ప్రేమించటం ఎలా …?” అనే సినిమాలోని ఒక పాట విడుదలై యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది . “నీలి నీలి ఆకాశం ” అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రచించారు . ప్రేమికుల మధ్యన ఉండే భావాలను చంద్రబోస్ ఈ పాటలో అద్భుతంగా తెలియజేశారు . ఆ సాహిత్యాన్ని చూస్తే ప్రేమలో లేని వారు కూడా ప్రేమలో ఉండే మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకునేట్టుగా ఉంది .

సాధారణంగా ప్రేమ అంటే కొలమానం లేనిది , ఎన్ని బహుమానాలు ఇచ్చినా ప్రేమకు సరిపోదు . ఇదే విషయాన్ని చంద్రబోస్ ఈ పాటలో తెలియజేశారు .

“నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా
నీ నవ్వుకు సరిపోదంటున్నా ”

ప్రేమికుడికి తన ప్రేయసి తప్ప ఈ ప్రపంచంలో ఏదీ కూడా గొప్పగా కనిపించదు . ఇదే విషయాన్ని చంద్రబోస్ ఈ పంక్తుల ద్వారా తెలియజేశారు . సాధారణంగా నెలవంకను చాలా అందమైనదిగా చెప్తారు . అయితే ప్రేమికుడు తన ప్రేయసి అందం ముందు నెలవంక కూడా సరిపోదనే విషయాన్ని చంద్రబోస్ చక్కగా చెప్పారు . ముఖ్యంగా నెలవంక , ఆకాశం వంటివి ప్రస్తావించడంలో చంద్రబోస్ గారి ఊహాశక్తికి జోహార్లు .

“నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నెలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంతగొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే ”

ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని ఇంకొక విధంగా చంద్రబోస్ గారు ఇక్కడ ప్రస్తావించారు . తన ప్రేయసి గురుంచి ప్రేమికుడు ఎలా ఆలోచిస్తాడు అనే దానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ తెలియజేశారు . ముఖ్యంగా నేల మీద నడుస్తుంటే తారలు మొలవటం ,
కేవలం ప్రేయసి వొదిలే శ్వాస వల్లనే గాలులు బ్రతకడం వంటివి గొప్పగా తెలియజేశారు .

“ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే
ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా ఆ చుక్కను పెట్టాలే ”

ఇక్కడ చూస్తే కనుక చంద్రబోస్ గారు ప్రియుడు తన ప్రేయసి అందాన్ని ఇలాగే పోల్చుకోవాలనేటట్టుగా తెలియజేశారు . వానవిల్లు అంటే ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు లో లేని రంగు లేదు . ఆ రంగుల మిశ్రమంతోనే  వేరే రంగులు ఏర్పడతాయి . ఇక్కడ ప్రేమికుడు తన ప్రేయసి ఏ రంగుకు సరిపడదని చెప్పడం వంటివి చెప్పడం చంద్రబోస్ గారికే చెల్లింది . సాధారణంగా నల్ల మబ్బు మెరిసినప్పుడు అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది దానికి మించిన అందం ఉండదు . అయితే ఇక్కడ ప్రియుడు తన చెలి కళ్ళు అంతటి ప్రకాశవంతమైనవని ఆ కళ్ళకి కాటుక అస్సలు అవసరమే లేదనేది భావన . సాధారణంగా దిష్టి తగలకుండా ఉండడానికి బుగ్గపై నల్లటి దిష్టి పెడుతుంటారు . అయితే ఇక్కడ ప్రియుడు తన ప్రేయసి అందానికే అందంగా భావించి ఆ దిష్టి చుక్కు మొత్తం శరీరమంతా పెట్టాలి భావన . ఇటువంటి వర్ణనలతో , పోలిస్తే ఇలాగే పోల్చాలి అనే విధంగా తెలియజేసిన చంద్రబోస్ గారికి జోహార్లు .

“ఏదో ఇవ్వాలి కానుక
ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక
అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా ”

అంతటి గొప్పదైన తన ప్రేయసికి సరిపడనటువంటి బహుమానం ఈ ప్రపంచంలో లేదని ఎప్పటికైనా దొరకకపోతుందా అనే ఆశతో ప్రియుడు నిరంతరం వెతికినా ఆమె సాటికి ఏమి రాకపోవడంతో ప్రియుడు తన ఓటమిని ఒప్పుకుంటున్నాను అనే భావనను చెప్పారు చంద్రబోస్ గారు

“నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా

ఓహో అమ్మ చూపులే ఒలికే జాలి నువ్వులే
ఆ జాలి మారుగా ఏమి ఇవ్వాలె
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమసిగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక
ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక
అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్ళి మళ్ళి జన్మనెత్తి నిన్ను చేరనా ”

ఒక బలమైన బంధం ఏర్పడాలంటే ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఒకేలా ఉండాలి . ఇదే విషయాన్ని చంద్రబోస్ గారు అత్యంత సరళమైన అందరికి అర్ధమయ్యే పదాలతో తెలిపారు . ఇక్కడ ప్రేయసి తన ప్రియుడు గురుంచి ఎలా భావిస్తుందని తెలిపారు . పిల్లలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ కళ్ళల్లో ఒక కరుణ భావం ఎప్పటికీ ఉంటుంది . మరి అటువంటి కరుణ తో సమానమైన ప్రియుడు తానేమివ్వగలను అనే భావన ప్రేయసికి కలగడం , చిన్నప్పటి నుండి మన వేలు పట్టుకొని లోకాన్ని పరిచయం చేసేవాడు నాన్న , ప్రియుడు కూడా ప్రేయసికి తన లోకాన్ని అందంగా చూపిస్తాడు , మరి అటువంటి మనిషికి ఎప్పటికీ ఒక బిడ్డగా ప్రేయసి ఉండాలనుకోడం గొప్ప వర్ణన .మరి అటువంటి ప్రియుడు ఉన్నప్పుడు ఏ ప్రేయసైనా జన్మ జన్మలకు తాను మాత్రమే తోడుగా కావాలనుకోవడం సహజం .

మరి ఇంతటి గొప్ప పదజాలంతో , ప్రకృతికి ముడిపెట్టి వర్ణించిన చంద్రబోస్ గారికి మనం కూడా ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలనే అందరిలో కలుగుతోంది.

– ఎస్ ఏ టి శ్రీనాధ్ , హైదరాబాద్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments