ప్రేమ... వర్ణనలకు అందనిది, మాటల్లో చెప్పలేని అనుభూతి. ఈ రెండక్షరాల పదం చుట్టూ ప్రపంచం మొత్తం తిరుగుతుంది. 

ప్రపంచంలో ఎన్ని రకాల ప్రేమలు ఉన్నా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య ప్రేమ చాలా వినూత్నంగా ఉంటుంది, ఎన్నో భావాలతో, అనుభూతులతో కూడి ఉంటుంది. మన పురాణాలు, చరిత్రలు చూసినా కూడా అనేక అమర ప్రేమకథలు మనకు కనపడతాయి, అంత గొప్పదైన ఈ ప్రేమ గురుంచి అనేకమంది రచయతలు, కవులు అనేక రీతులలో వర్ణించారు. 

తెలుగు సినిమాలలో ఎటువంటి ద్వందార్థాలు లేకుండా ప్రేమ గురుంచి అద్భుతంగా వర్ణించిన పాటలు చాలానే ఉన్నాయి. అలంటి పాటలలో ఒకటి ఈ మధ్యనే మనకు దూరమైన కులశేఖర్ గారు రాసిన "నిను చూడక ముందర తెలియదులే" పాట, విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ ముఖ్య పాత్రలలో నటించిన వసంతం సినిమాలోనిది ఈ పాట. చాలా సరళమైన పదాలతో ప్రేమ గురుంచి చాలా వినూత్నంగా తెలిపారు కులశేఖర్ గారు. 

అలంటి అద్భుతమైన సాహిత్యాన్ని,ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

"నిను చూడక ముందర

తెలియదులే

అసలందము ఉన్నదని

నిను చూసిన కంటికి ఎప్పటికి

నిదురన్నది రాదు మరి"

ఈ పంక్తిలో మనం చూస్తే ప్రేమికుడు తన ప్రేయసిని మొదటిసారి చూసినప్పుడు సహజంగా కలిగే భావనలు కులశేఖర్ గారు చాలా అద్భుతంగా వివరించారు. ప్రేమలో ఉన్నవారికి తన ప్రేమికుడు లేదా ప్రేయసి మాత్రమే ఈ ప్రపంచంలో చాలా అందంగా కనపడతారు, ఇది సహజం. ఇదే విషయాన్ని "నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని" ద్వారా తెలియజేసారు రచయత. అంటే ప్రేమికుడికి తన ప్రేయసిని చూసేవరకు ఈ ప్రపంచంలో అందం అనేది ఒకటి ఉందని తెలియలేదని అర్ధం. ఒక మనిషిని మనం బాగా ఇష్టపడినప్పుడు ఎప్పుడు వాళ్ళ ఆలోచనల్లోనే ఉంటాము.ఇదే విషయాన్ని "నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు మరి" ద్వారా తెలియజేసారు కులశేఖర్ గారు. అంటే ప్రేమికుడు తన ప్రేయసి అందాన్ని తలచుకొని ఎప్పుడు అదే ఊహల్లో ఉంటూ నిద్రను మరిచాడని అర్ధం. 

"మదిలో మరు మల్లెల వాన

కురిసే వేళా

పగలే సిరివెన్నెల రాదా

చెలియా నీలా"

ఈ రెండు లైన్ల ద్వారా ప్రేమికుడు యొక్క భావాలను ఇంకా అద్భుతంగా ఆవిష్కరించారు రచయత. మరు మల్లెలు ఎంతో మృదుత్వానికి చిహ్నం, మరి ప్రేయసిని ప్రేమికుడు మొట్టమొదటిసారి చూసినప్పుడు తన మనస్సులో మరుమల్లెల వాన కురుస్తునట్టు అనిపిస్తుందట అంటే ప్రేమికుడు ఆనందానికి హద్దు లేదని అర్ధం. అలాగే ఇంకా చెప్తూ "పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా" అన్నారు. అంటే వెన్నెల మనసుకు హాయిని కలిగించే చల్లదనానికి ప్రతీక, మరి అటువంటి సిరివెన్నెల పగటిపూట వచ్చినట్టు అనిపించిందట ప్రేమికుడుకి. దీని బట్టి తన ప్రేయసిని ఎంతగా ఆ ప్రేమికుడు ఆరాధిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు 

"ఓ పాలరాతి బొమ్మ

నాలోన ఊపిరమ్మ

ఓ కొండపల్లి బొమ్మ

నీ రాక కొత్త జన్మ"

ప్రేమికుడుకి తన ప్రేయసి ప్రపంచంలోనే అందమైనదిగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఈ పంక్తిలో వివరించారు కులశేఖర్ గారు. బొమ్మలలో పాలరాతి బొమ్మలు మరియు కొండపల్లి బొమ్మలు అత్యంత అందమైనవిగా చెప్పుకుంటాం. ఇక్కడ ప్రేమికుడికి తన ప్రేయసి అంతే అందంగా, ఎంతో గొప్పగా కనిపిస్తుందని అర్ధం. ఇంకా చెప్తూ ప్రేయసిని మొదటి సారిగా చూసినప్పుడు ప్రేమికుడు తనకు కొత్త జన్మ లభించినట్టు భావించి తన ఊపిరిలో ఆమెను నిలుపుకున్నాడని అర్ధం. కేవలం ఈ చిన్న పంక్తిలో ప్రేమ గురుంచి ఎంతో గొప్పగా వర్ణించారు. 

"రంగు రంగు పువ్వుల్లో

లేనె లేదు ఈ గంధం

నిన్ను తాకి పొందిందా

చల్లగాలి సాయంత్రం"

ఇక ఈ పాట మొదటి చరణంలో ప్రేమికుడిలోని మరిన్ని భావాలను ఎంతో సరళంగా వర్ణించారు రచయత కులశేఖర్. 

"రంగు రంగు పువ్వుల్లో లేనె లేదు ఈ గంధం" పూలు సుగంధానికి ప్రతీక,అయితే ఇక్కడ ప్రేమికుడి భావన ఏమిటంటే తన ప్రేయసి తన పక్కన ఉన్నప్పుడు ఉండే ఆహ్లాదం ఎన్ని పూల మధ్య ఉన్నా కూడా తాను పొందలేదని అర్ధం, అలాగే "నిన్ను తాకి పొందిందా చల్లగాలి సాయంత్రం" ఈ లైన్ ద్వారా రచయత ఏమి చెప్పదలుచుకున్నారంటే సాయంత్రం వేళ మన శరీర బడలిక పోగొట్టి మనసుకు ఆహ్లాదాన్ని అందించే చాలాగాలులు వీస్తుంటాయి కదా, మరి ఆ గాలులకు చల్లదనం తన ప్రేయసిని తాకడం వల్లనే వచ్చిందని ప్రేమికుడి భావన. ఈ వర్ణన చూస్తుంటే నిజమైన ప్రేమలో కలిగే భావనలను ఇంతకంటే ఎవరైనా గొప్పగా చెప్పగలరా అనిపిస్తుంది. 

"వేల వేల భాషల్లో

లేనె లేదు ఇంతందం

తేలికైన నీ మాటే

సుస్వరాల సంగీతం"

మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టు ప్రేమికుడికి తన ప్రేయసిలో ఉన్న ప్రతీ లక్షణం అన్నిటికంటే అద్భుతంగానే ఉంటుంది. ఇక్కడ ప్రేమికుడుకి తన ప్రేయసి మాటలు వింటుంటే చాలా మధురమైన సంగీతం వింటున్నట్టు హాయిగా ఉందని అలాగే తన ప్రియురాలి మాటాల్లో ఉండే అందం ఈ ప్రపంచంలోని ఏ భాషలో కూడా లేదని భావిస్తున్నాడు. 

"ఓ నీలోని ఈ మౌనం

కవితే అనుకోన

నవ కవితే అనుకోన

నాలోని ఈ ప్రాణం

వెతికే చిరునామా

నీవేగా ఓమైనా"

ఇక ఈ పంక్తిలో చూస్తే ప్రేమలో ఉండే గొప్పతనం కనపడుతుంది. ప్రేమలో ఉన్నవారు ఊహల్లో ఉండడం చూస్తుంటాం, అది సహజం.ఇక్కడ ఈ పాట రచయత అయిన కులశేఖర్ ప్రేమికుడి భావాలను ప్రస్పుటంగా ఆవిష్కరించారు. 

ఒక విషయాన్ని అద్భుతంగా, గొప్పగా కవితల ద్వారా చెప్పవచ్చు, అయితే ఇక్కడ తన ప్రేయసి ఏమి మాట్లాడకపోయినా కూడా తన మౌనాన్నే కవితగా భావిస్తున్నాడు ప్రేమికుడు అంటే ఇక్కడ మనకు ప్రేమలోని స్వచ్ఛత అర్థమవుతోంది. అలాగే తన మనస్సు ఎవరికోసమైతే ఇన్నాళ్లు వెతికిందో అది తన ఎదురుగా ఉన్న తన ప్రేయసేనని ప్రేమికుడు భావించాడు. 

"సూరీడు జారుకుంటే

లోకాలు చీకటేగా

నువుకాని దూరమైతే

నాగుండె ఆగిపోదా"

మనకు అత్యంత దగ్గరైన వారు మనకు దూరంగా ఉంటే మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటాం, ఇదే విషయాన్ని ఇక్కడ తెలియజేసారు రచయత. ఇక్కడ ప్రేమికుడి భావన ఏమిటంటే సూర్యుడు అస్తమిస్తే ఏ విధంగా అయితే వెలుగు పోయి చీకటి అలుముకుంటుందో అలాగే తన ప్రేయసి దూరంగా ఉంటే తన ప్రాణం పోయినట్టు అవుతుందట. అంటే ఇక్కడ ప్రేమికుడు తన ప్రేయసికి తన మనసులో ఎలాంటి స్థానం ఇచ్చాడో తెలుసుకోవచ్చు.  

"నీలి నీలి కన్నుల్లో

ఎన్ని ఎన్ని అందాలు

కాటుకమ్మ కలమైతే

ఎన్ని వేల గ్రంథాలు"

ఇక్కడ ప్రేమికుడు తన ప్రేయసి కన్నులను ఎంతో అందమైనవి భావిస్తున్నాడు. సాధారణంగా ఏ విషయాన్నైనా విపులంగా చెప్పడానికి గ్రంథాలు రాస్తుంటారు. ఇక్కడ ప్రేమికుడి భావన ఏమిటంటే తన ప్రేయసి కన్నులకు దగ్గరగా ఉండే కాటుక ఆమె కన్నుల అందాన్ని వర్ణించడానికి ఎన్నో వేల గ్రంథాలు రాయవలసి వస్తుందట, అంటే ఆమె కన్నుల సౌందర్యం గురుంచి ఎంత వర్ణించినా సరిపోదని అర్థం. 

"ముద్దుగుమ్మ నవ్వుల్లో

రాలుతున్న ముత్యాలు

పంచదార పెదవుల్లో

తెంచలేని సంకెళ్లు"

ఇక ఈ పంక్తిలో ప్రేయసి యొక్క నవ్వును గురుంచి ప్రేమికుడి భావనలను తెలియజేసారు రచయత. ముత్యాలను ఎంతో అందమైనవిగా మనం భావిస్తుంటాం, మరి తన ప్రేయసి నవ్వుతుంటే ఆ నవ్వుల ద్వారా ముత్యాలు రాలుతున్నట్టు భావిస్తున్నాడు ప్రేమికుడు అంటే ఇక్కడ ప్రేమికుడు ప్రేమ ఏ స్థాయిలో ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చు. అలాగే రచయత ఇంకా చెప్తూ "పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు" అని అన్నారు. ఇక్కడ ప్రేమికుడు తన ప్రేయసి నవ్వును ఎప్పటికీ అలాగే చూస్తూ ఆ పెదవుల నుండి చూపి మరల్చలేడని అర్ధం. 

"ఓ నాలోని ఈ భావం

ప్రేమే అనుకోన

తొలి ప్రేమే అనుకోన

ఈ వేళ ఈ రాగం

వరమే అనుకోన

కలవరమా నిజమేనా"

జీవితంలో కొంతమందిని మనం కలుసుకున్నప్పుడు ఎప్పుడు కలగని అనుభూతి కలుగుతుంది, తర్వాత అది ప్రేమగా మారుతుంది. ఇదే విషయాన్ని రచయత ప్రేమికుడి భావనల ద్వారా తెలియజేసారు. 

ఇక్కడ ప్రేమికుడు తన ప్రేయసిని చూసిన మొదటిక్షణం నుండి తన మనస్సులో కలిగే భావనలకు ఏ పేరు పెట్టాలో తెలియక తొలిప్రేమగా భావిస్తున్నాడు, అలాగే తనలోని భావనలను ఈ విధంగా తెలియజేయడం తాను నమ్మలేకపోతున్నాడని అర్ధం. 

"ఈ ప్రేమ బాష రాక

నీతోటి చెప్పలేక

నీలాల కంటిపాప

రాసింది మౌనలేఖ"

ప్రేమలో ఉన్న సున్నితమైన భావాలను ఎంతో గొప్ప రచయతలు మాత్రమే చెప్పగలరు, అలంటి గొప్ప రచయితలలో ఒకరైన కులశేఖర్ అద్భుతమైన మాటలలో ప్రేమికుడి మానసిక స్థితిని తెలియజేసారు. 

ప్రేమ కలిగినప్పుడు మొదట ఎవరూ కూడా ధైర్యంగా ఎదుటివ్యక్తికి చెప్పలేరు, అయితే ఇక్కడ ప్రేమికుడు కూడా తన మనసులో మాట ప్రేయసికి చెప్పలేక కేవలం తన కళ్ళతో తన ప్రేమను తెలియజేస్తున్నాడు ... 

ఇలాంటి గొప్ప సాహిత్య విలువలతో కూడిన పాటలు రాసిన కులశేఖర్ అతి చిన్న వయసులో మనకు దూరమవ్వడం బాధాకరం,తెలుగు సినీ సాహిత్యాభిమానులకు తీరని లోటు. 

- ఎస్. ఏ. టి. శ్రీనాథ్