పల్లవి:
Male:
మనసే హాయిగా ఏరై పారేనే సెలయేరై పారేనే..
విరిసే పూవులే దారై పోయేనే..
రహదారై పోయేనే
Female:
గుండెల్లో పొంగేటి ఆశలే
బంధాలు వేశాయిలే..
నీలాల ఆ నింగి తారలే
గారంగా చూశాయిలే..
Male:
అరె కళ్ళలోన దాచుకున్న
కలల అలలు ఇవిలే..
౹౹మనసే హాయిగా౹౹
చరణం:
Male:
ఎదలో రాగాలు సుధలే చిందేనే..
ఇలలో అందంగా కథలే రాసేనే..
Female:
అడుగు అడుగు తోడుగా
సాగేను కాలాలుగా..
చిలిపి చిలిపి వేడుక
చిత్రాలు చేసేనుగా..
Male:
చిరు కిరణమిలా చేరెనెలా
ఆకాశమార్గాన నేలా..
Female:
అది చూసింది ఓ చారుశీలా..
౹౹మనసే హాయిగా౹౹
చరణం:
Female:
మదిలో భావాలు మెదిలే వేదాలై..
హృదిలో నాదంగా కదిలే యోగాలై..
Male
ఎగసె ఎగసె ఊహలే బంగారు ప్రాయాలుగా..
మెరిసె మెరిసె మేఘమే
సింధూర వర్ణాలుగా..
Female:
ఒక పాట ఇలా పలికెనులే
ఆనంద లోకాన నేడు
Male:
అది హిందోళ రాగాన చూడు
౹౹మనసే హాయిగా౹౹●

  • – రచన : మౌనశ్రీ మల్లిక్

సంగీతానికి సాహిత్యానికి వారధి

భీమవరం టాకీస్ బ్యానర్ మీద తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలో నరసింహ నంది దర్శకత్వంలో ఈనెల పదోతేదీన విడుదలవుతున్న జాతీయరహదారి చిత్రంలోని అద్భుతమైన గీతమిది. నరసింహ నంది పేరు చెప్పగానే 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి విభిన్నమైన కథాంశాలతో హృదయానికి హత్తుకునే చిత్రాలు మనముందు కదలాడుతాయి. ఇవన్నీ కూడా అవార్డుల పంట పండించిన చిత్రాలే కావడం విశేషం. ఆ కోవలోనే వస్తున్న మరో చిత్రరాజమిది.
ఈ సినిమా పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్ అనేక చలన చిత్రాలకు, టీవీ సీరియళ్లకు వందలాది పాటలు రాసి సమకాలీన రచయితలలో తనకంటూ ప్రత్యేకమైన ఒరవడిని ఏర్పరచుకున్నారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతమైన గీతమిది.
సంగీత, సాహిత్య రహస్యాలను తెలిసిన రచయిత తప్ప మరొకరు రాయలేని పాట ఇది. జాను తెనుగులో సాగిన యుగళగీతం. లలిత లలితమైన అలతి అలతి తెనుగుపదాలతో సరళంగా సాగిన సుందర గీతమిది. ఎక్కడా ద్విత్వాక్షరాలు కానీ, క్లిష్టమైన నిఘంటువు అవసరం అయిన పదాలు కానీ ఉపయోగించకపోవడం ఆ పాత్రల మనస్తత్త్వాన్ని పట్టిచూపుతోంది. పాటలోని పదాల పొందిక, ఆ భార్యాభర్తల అన్యోన్యతను చాటిచెబుతున్నాయి. సాహిత్య పరిభాషలో దీనిని రచనాకళగా పరిగణించాలి. ఇలాంటి ప్రయోగాలు పాటకు ఉన్నతస్థాయిని కలిగిస్తాయి. అలాగే రచయిత స్థాయి ఎంతటిదో తెలుపుతాయి.


పల్లవిలో ‘విరిసే పూవులే దారై పోయెనే.. రహదారై పోయెనే.. అని రాయడంలో ఒక అలంకారం ఉంది. చిత్రం పేరు జాతీయ రహదారి లో రహదారి అనే పదాన్ని ఇమడ్చడం ముద్రాలంకారమని అంటారు. ఇది సాహిత్యపరంగా ఒక రచనా విన్యాసమని చెప్పవచ్చు.
పాట అనేది ప్రధానంగా శబ్దానికి సంబంధించింది. శబ్దాలంకారాలు ముఖ్యం దీనివల్ల పాటకు శబ్దసౌందర్యంతో పాటు అర్థగాంభీర్యం అబ్బి, భావయుక్తంగా.. లయబద్ధంగా శ్రవణపేయంగా సాగుతుంది. ఈ పాట రచయిత వీటన్నిటితో పాటు చక్కటి రచనా శిల్పాన్ని పాటించి పాటకు కొత్త సొబగులు అద్దారు.
పల్లవిలో ఉండే శాబ్దికమైన, ఆర్థికమైన సౌందర్యాలు పరిశీలించే ముందు.. రచనాశిల్పాన్ని పరికిద్దాం. ‘మనసే హాయిగా ఏరై పారేనే’ అంటూ గీతాన్ని ఎత్తుకొని ముగింపులో.. చరణాల్లో ‘ఒక పాట ఇలా పలికెనులే.. ఆనందలోకాన నేడు’ అని నాయిక అంటే ‘అది హిందోళరాగాన చూడు’ అంటూ నాయకుడు ముగిస్తాడు. ఇందులో సాహిత్యపరంగా, సంగీతపరంగా కూడా గొప్ప విశేషాలున్నాయి. పల్లవిని, ముగింపు చరణాల్ని ముడివేసి రచనాశిల్పాన్ని ప్రదర్శించడంలో రచయిత గడుసుదనాన్ని అభినందించి తీరాలి. మనసులో హాయిగా పారే భావపరంపర ఆనందలోకాలకు తీసుకెళ్లే విశిష్టమైన ఒక గీతమిదని ధ్వనింపజేశారు. ఈ ఆనందలోకాలలో విహరించేది ఎవరు? అని ప్రశ్నిస్తే సమాధానం తెరమీది నాయికానాయకులే కాదు, ఎదురుగా కూర్చున్న ప్రేక్షకలోకం కూడా అని చెప్పకనే చెప్పారు. ఇదంతా సాహిత్యానికి సబంధించిన విశేషాలైతే.. ఇక్కడ సంగీతపరంగా ఒక రహస్యాన్ని ఇమిడ్చారు.

నాయిక ‘… ఆనందలోకాన నేడు’ అని ముగిస్తే నాయకుడు ‘అది హిందోళరాగాన చూడు’ అంటాడు. ఇక్కడ ఏరాగమైనా చెప్పొచ్చు. కానీ హిందోళ రాగం అనడంలో విశేషముంది. హిందోళరాగం స్వభావరీత్యా మనోరంజకమైంది. మోహనరాగ ఛాయకూడా కని(విని) అంతటి మనోరంజకమైన గీతం ఇది కాబట్టే అటు నటులు, ఇటు ప్రేక్షకులు ఆనందలోకాన పరవశించడం ఖాయమని రచయిత ప్రగాఢ విశ్వాసం.
ఇక పల్లవి, చరణాలలోని సౌందర్యాలను పరిశీలిద్దాం. పల్లవిలో ‘మనసే హాయిగా ఏరై పారెనే సెలయేరై పారెనే’ అనడంలో శరీర తత్త్వానికి సబంధించి శాస్త్రీయమైన విశేషం దాగి ఉంది. మనసును శాస్త్రం ఆలోచనాత్మకంగా చెప్పింది. నిర్ణయాత్మకమైంది బుద్ధి. మనసులో ఆలోచనలు అలలుగా పరంపరగా సాగుతూంటాయి. దీనినే రచయిత ‘ఏరై పారెనే’ అని చెప్పి అంతటితో ఊరుకోకుండా, ‘సెలయేరై పారెనే’ అనడంలో అసలు అందం దాగి ఉంది. సాధారణంగా పారే ఒక ఏరుకు, సెలయేరుకు ఎంతో భేదం ఉంటుంది. ఏరు మురికి నీటితో కూడా కలిసి పారుతుంది. సెలయేరు అలా కాదు. కొండలమీద నుంచో.. గుట్టలమీద నుంచో అందంగా.. ఉరవడిగా.. దూకుతుంది. ఆ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందులో కనులకు ఆహ్లాదం కనిపిస్తుంది. శ్రవణాలకు లయబద్ధమైన ధ్వని వినిపిస్తుంది. వెరశి ఆనందం కలిగిస్తుంది. అదే రచయిత గూఢంగా చెప్పారు. మనసులో అలలుగా, తెరిపిలేకుండా కలిగే భావపరంపరలు అన్నీ అందమైనవి, ఆహ్లాదమైనవీ అని పల్లవిలోనే చెప్పి ఆ జంట మానసిక స్థితికి అద్దం పట్టారు.

‘అడుగు అడుగు తోడుగా సాగేను కాలాలుగా..’ అని చరణం సాగడంలో విశేషార్థాన్ని స్ఫురింపజేశారు. అడుగు.. అడుగు.. అనడంలో ఇక్కడ పడే ప్రతి అడుగు ఏడడుగులను గర్తుచేసిందని చెప్పినట్లయింది. అంతేకాదు, ‘సాగేను కాలాలుగా..’అనడంలో మరింత విశేషం ఉంది. అది ఏడేడు జన్మల బంధంగా నిలుస్తుందనే అర్థం స్ఫురింపజేయడం ద్వారా భారతీయ సంప్రదాయానికి పట్టంకట్టినట్లయింది.

ఎదలో రాగాలు సుధలే చిందినే… ఇలలో అందంగా కథలే రాసేనే.. ఈ చరణం కూడా ప్రత్యేకంగా చెప్పదగిందే. ఇక్కడ రాగాలు.. ఆ జంట మదిలోని అనురాగాలే! సుధలు చిందడం వల్ల ఆ అనురాగాలకు అమృతత్వం ఆపాదించినట్లయింది. అమృతమయమైన ఆ అనురాగాలు కథలుగా అవతరిస్తే అందంగా.. ఆనందంగా శాశ్వతంగా ఉంటాయనడంలో సందేహముండదుకదా! ఈ భావాన్నే ఈ చరణం చెబుతోంది.

అంత్యప్రాసలు, అనుప్రాసలు పాటకు చక్కటి తూగును, లయను కలిగిస్తుండగా.. ధ్వని ప్రధానంగా అర్థాలంకారాలు ఒక గాంభీర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇలా పాటలోని ప్రతిచరణం విశేషంగా సాగింది.

సుక్కు సంగీత దర్శకత్వంలో రవి, జయశ్రీ గళాల నుంచి మృదుమధురంగా హృదయానికి హత్తుకునేలా జాలువారిన ఈ గీతం పాటల రహదారిలో ఒక మైలురాయిలా నిలుస్తుందని చెప్పవచ్చు.

చక్రవర్తుల మురళీకృష్ణ

90304 75131

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments