భారత బ్యాడ్మింటన్ తార పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ఈ నేపథ్యంలో, సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన, సీనియర్ హీరో నాగార్జున, సీనియర్ నటీమణులు రాధిక, సుహాసిని కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రెండు ఒలింపిక్స్ పతకాలతో సింధు అద్భుత ఘనత సాధించిందని కొనియాడారు. ఇది నా బిడ్డ సాధించిన విజయంగా భావించి సింధును సత్కరించానని వెల్లడించారు. సింధును ఆత్మీయుల మధ్య గౌరవించడం ఎంతో ఆనందాన్నిస్తోందని తెలిపారు.

మెగాస్టార్ అంతటివాడు స్వయంగా తన ఇంటికి ఆహ్వానించి సన్మానించడం పట్ల సింధు సంతోషంతో పొంగిపోయింది. చిరంజీవి గారు ఇంటికి పిలిచి గౌరవించడం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించేందుకు కృషి చేస్తానని వెల్లడించింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments