ఆగస్టు 22న అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో సందడి మొదలైంది. చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులు ఆయన పాత ఫొటోలను, బర్త్‌డే కవర్‌ ఫొటోలను పంచుకుంటున్నారు. చిరు ఫొటోతో తమ డీపీలను కూడా మార్చేస్తున్నారు. ఇక చిరు చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు సైతం క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు మోహన్‌రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌లో చిరు నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ కూడా మొదలైంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. టైటిల్‌/ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాతో పాటు, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆదివారం ఉదయం 9గంటలకు ‘మెగా యుఫోరియా’ పేరుతో అప్‌డేట్‌ ఇవ్వన్నట్లు తెలిపింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో పాటు, కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తికర విషయాన్ని పంచుకోనుంది. ‘మెగా వేవ్‌’ పేరుతో ఆదివారం సాయంత్రం 4.05గంటలకు అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. నిలిపి ఉన్న ఓడకు యాంకర్‌ వేలాడుతూ దాని వెనుక చిరంజీవి రూపం ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు చిరు బర్త్‌డే మోషన్‌ పోస్టర్‌ కూడా ట్రెండింగ్‌లో ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments