వాళ్లిద్దరికీ పెళ్లై 17 ఏళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అతను బండి మీద సమోసాలు విక్రయిస్తుంటాడు. ఆమె అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇంటి దగ్గర సమోసాలు, చట్నీ చేసుకుని రోడ్డు పక్కన పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత శనివారం భార్య చేసిన చట్నీ నచ్చలేదని భర్త ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె మరణించింది.

మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా, ఉపరాయణ్ గ్రామంలో ఆనంద్ గుప్తా, ప్రీతి దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపక్కన సమోసాలు అమ్ముతూ ఉంటారు. ఇంటిదగ్గరే సమోసాలు, చట్నీ తయారు చేసుకువచ్చి విక్రయిస్తుంటారు.

రోజు మాదిరిగానే శనివారంకూడా సమోసాలు అమ్మటం మొదలెట్టారు. ఇంతలో ఉదయం తెచ్చిన చట్నీ అయిపోయింది. సమోసాలు మిగిలి ఉన్నాయి. ఇంటికెళ్లి త్వరగా చట్నీ తయారు చేసి తీసుకురమ్మనమని ఆనంద్, భార్య ప్రీతికి చెప్పాడు. ఆమె ఇంటికెళ్లి చట్నీ చేసి తీసుకు వచ్చింది.

అది ఆనంద్‌కు నచ్చలేదు. దీంతో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాగైతే కస్టమర్లు మన దగ్గరకు రారు, మన సమోసాలు ఎవరూ కొనరని తిట్టాడు. ప్రీతి కూడా భర్తకు గట్టిగా సమాధానం చెప్పింది.

దీంతో ఆగ్రహించిన ఆనంద్ దగ్గరలో ఉన్న పెద్దకర్ర తీసుకుని ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు గాయాలపాలైన ప్రీతి అక్కడి కక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసి ఆనంద్‌ను అరెస్ట్ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments