సీఎం కెసిఆర్ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పింఛన్ల అర్హతను 57 ఏళ్లకు తగ్గించిన ప్రభుత్వం ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. అనాథ శరణాలయాల స్థితిగతులను సమీక్షించడంతో పాటు వారి సంక్షేమానికి విధాన రూపకల్పన కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.

కొత్తగా మంజూరు చేసిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని, గచ్చిబౌలితోపాటు సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్ ఆసుపత్రులను ‘టిమ్స్’గా పిలవాలని, హైదరాబాద్ నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.

కాగా, దళితబంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. దళితులను పెట్టుబడిదారులుగా అభివృద్ధిచేయడం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌’ ఏర్పాటుచేయాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆరు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. దళిత బంధు అమలుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన వెంటనే షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఈ పథకం కోసం రూ.250 కోట్లను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments