తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌), డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ.. హైకోర్టుకు నివేదిక సమర్పించారు.ఈ సందర్భంగా ఉన్నతన్యాయస్ధానం ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.

రాష్ర్టంలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 79 ఆస్పత్రులకు, 115 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 10 ఆస్పత్రుల కరోనా చికిత్స రద్దు చేసినట్లు తెలిపారు.
గత నెల 29న లక్ష కరోనా పరీక్షలు నిర్వహించామని వివరించారు. రెండో దశ ఫీవర్ సర్వేలో 68.56 శాతం మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. ప్ర్రైవేట్ ఆస్పత్రుల పై వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

నీలోఫర్ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటుచేశామని…. ప్రభుత్వ ఆస్పత్రులలో ఆక్సిజన్ పడకల సంఖ్య పెంచుతున్నామని అధికారులు కోర్టుకు విన్నవించారు. కరోనా మూడో దశకు అవసరమైన మందులను ముందే కొనుగోలు చేస్తామని… సిబ్బందికి శిక్షణ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కోర్టుకు తెలిపారు. బ్లాక్ ఫంగస్ మందులకు దేశవ్యాప్తంగా కొరత ఉందని…ఔషధాలు కొనుగోలు చేస్తున్నామని డీహెచ్ తెలిపారు.

ఔషధాల బ్లాక్‌ మార్కెట్‌పై 150 కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి… రూ.35.81 కోట్ల జరిమానా విధించినట్లు వెల్లడించారు.

భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేసామని.. జనం గుమిగుడినందుకు 13,867 కేసులు పెట్టినట్లు తెలిపారు. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదుచేసినట్లు డీజీపీ తన నివేదికలో వెల్లడించారు. లాక్‌డౌన్‌ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నాన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments