తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి మే 1 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు, అత్యవసర సేవలందించేవాటికి మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ సమయంలో అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి.

అత్యవసర సర్వీసులు ఏవంటే…

  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
  • టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసులు
  • ఈ-కామర్స్ డెలివరీ
  • పెట్రోలు పంపులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పెట్రోల్, గ్యాస్ అవుట్‌లెట్‌లు
  • విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలు..
  • నీటి సరఫరా, పారిశుద్ధ్యం
  • కోల్డ్ స్టోరేజ్, గోదాములు
  • ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 5,926 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 18 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,856కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న కొత్తగా 793 మంది వైరస్‌ బారిన పడ్డారు.

కేసులు పెరుగుతుండడంతో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాల్లో ఇప్పటిక కట్టుదిట్టమైన ఆంక్షలు అమలవుతున్నాయి. దిల్లీలో వారం రోజుల లాక్‌డౌన్ అమలవుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో రెండు వారాల లాక్ డౌన్ అమలవుతోంది. తెలంగాణలోనూ గత కొద్ది రోజులుగా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments