దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26వేల 291 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో(2021) నమోదైన అత్యధిక కేసులివే. క్రితం రోజుతో పోలిస్తే 3.8శాతం కేసులు పెరగడం ఆందోళనకరం. గడిచిన 24 గంటల్లో మరో 118 మంది వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు లక్షా 58వేల 725 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

2శాతానికి చేరువలో యాక్టివ్‌ కేసులు:
తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య కోటి 13లక్షల 85వేల 339కి చేరింది. ఇక ఇదే సమయంలో 17వేల 455 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోటి 10లక్షల 07వేల 352 మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 96.68శాతంగా ఉంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్ కేసులు కూడా మళ్లీ 2లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2లక్షల 19వేల 262 యాక్టివ్‌ కేసులుండగా.. యాక్టివ్ కేసుల రేటు 1.93శాతానికి పెరిగింది.

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం:
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉంది. కొన్నిరోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం(మార్చి 14,2021) ఈ కేసుల సంఖ్య ఏకంగా 16వేలు దాటింది. నిన్న అక్కడ 16వేల 620 మంది వైరస్‌ బారిన పడగా.. 50 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.19లక్షల యాక్టివ్‌ కేసులుండగా.. ఒక్క మహారాష్ట్రలోనే లక్షా 26వేల 231 యాక్టివ్ కేసులుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నాగ్‌పూర్‌ సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది.

తెలంగాణలో 157 కరోనా కొత్త కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో నిన్న(మార్చి 14,2021) రాత్రి 8 గంటల వరకు 38వేల 517 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 157 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం(మార్చి 15,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ఒకరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,654కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 166 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,681కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,983 ఉండగా.. వీరిలో 718 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 92లక్షల 38వేల 982కి కరోనా పరీక్షలు చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments