ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విజయవాడలోని పటమటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక ఎన్నికల్లో తొలిసారి పవన్ కళ్యాణ్ ఓటేశారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 78 లక్షల 71 వేల 272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,214 డివిజన్లు, వార్డులకు 7,552 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

75 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అవగా చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 71 మున్సిపాలిటీల్లోని 1,634 వార్డుల్లో పోలింగ్‌ జరగనుంది. 12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లు ఉండగా వీటిలో 89 ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 582 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 7 వేల 552 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. హైకోర్టు తీర్పు కారణంగా ఏలూరు కార్పోరేషన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్నా…. చివరకు పోలింగ్‌కు అనుమతి లభించింది.

పోలింగ్‌ కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు చేశారు. ఈ నెల 14న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments