విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గంటా మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోయాక కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తామని ఆయన ప్రకటించారు.

సీఎం జగన్ ఇప్పటికైనా కార్యాచరణ ప్రకటించాలని గంటా డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకైనా సిద్ధమే అని ఎమ్మెల్యే గంటా చెప్పారు. ఇప్పటికైనా స్పందించకుంటే మనం చరిత్ర హీనులుగా మిగిలిపోతామని గంటా అన్నారు. కేంద్రం నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని గంటా డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాటానికి దిగితే ఫలితం ఉంటుందన్నారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖసాగర తీరం హోరెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమంటున్నాయి. కేంద్రం ప్రకటన వెలువడిన వెంటనే.. కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు.

విశాఖ కూర్మన్నపాలెంలో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం(మార్చి 8,2021) సాయంత్రం మొదలైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కూర్మన్నపాలెం జంక్షన్‌వైపు వచ్చిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజును కార్మిక సంఘాల నాయకులు అడ్డుకున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కుండ బద్ధలు కొట్టేసింది. ప్లాంట్‌ ప్రైవేటీకరణ తథ్యమని ప్రకటించింది. ప్లాంట్‌ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదని, అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్పింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments