ప్రేమ ఒక మధురమైన అనుభూతి , ఈ రెండక్షరాల పదం చుట్టూ మన జీవితం తిరుగుతుంది . ఎంతటివారైనా ప్రేమ విషయంలో ఒక్కటే . ప్రేమకి అవధులు లేవు , అటువంటి ప్రేమ గురుంచి ఎన్ని పాటలొచ్చినా మనసును హత్తుకుంటాయి . అందులో ముఖ్యంగా శ్రావ్యమైన సంగీతానికి అర్ధవంతమైన , గొప్ప సాహిత్య విలువలతో కూడిన సాహిత్యం తోడైతే అది నిజంగా మధురమే .

అటువంటి మధురమైన పాటల్లో ఒకటి ఇటీవలే విడుదలైన వసంత కోకిల సినిమాలోని అదిగో అదిగో పాట . ఈ పాట వింటుంటే మనసు ఎంతో హాయిగా మధురానుభూతులని పొందుతుంది . ఈ పాటకి రాజేష్ మురుగేశన్ స్వరరచన చేయగా ప్రముఖ తెలుగు పాటల రచయత చంద్రబోస్ గారు తన పదరచనతో అందరినీ మంత్ర ముగ్ధులను చేశారు . ముఖ్యంగా ఈ పాటలో ఒక ప్రేమికుడి మనోగతాన్ని అద్భుతంగా వ్యక్తపరిచారు చంద్రబోస్ .

ఇక ఈ పాటలోని సాహిత్యాన్ని గూర్చి మనం తెలుసుకుందాం

మాటకన్నా మౌనం మిన్న
భాషకన్నా భావం మిన్న
అక్షరాల పంజరంలో నీ అందం ఆకాశాన్ని బంధించలేను
శబ్దాల ఇరుకుగదిలో నా ప్రేమ సముద్రాన్ని ఇమడ్చలేను
నీ చెక్కిళ్ళను నా చేతివేళ్ళు సుతారంగా స్పృశించినపుడు
నీ మెడఒంపున నేను వెచ్చని శ్వాసగా వశించినపుడు
నీ ఆధరాలలోకి నా అధరాల ద్వారా పంచప్రాణాలు ప్రవహించినపుడు
నా ప్రేమ కావ్యమవుతుంది
అది నీకు అర్ధమవుతుంది

సామాన్యంగా ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ప్రేమను ఎలా చూపించాలో ఎలా వ్యక్తపరచాలో తెలియక చాలా సతమతమవుతుంటాడు . ఆ ప్రేమను వ్యక్త పరచడానికి నోటి వెంట మాట రాక చాలా వరకు తన చేష్టలతో కళ్ళతో వ్యక్త పరుస్తుంటాడు . ఈ పైన ఉన్న పంక్తులను చూస్తే ఒక ప్రేమికుడి ప్రేమను చాలా సరళంగా తెలిపారు బోస్ గారు . మొదటి రెండు లైన్ల ద్వారా ప్రేమికుడు తన ప్రేయసికి ప్రేమను వ్వ్యక్తపరచడానికి ఏ మాటలు సరిపోక మౌనంగా ఉండిపోయాడని , ఏ భాషలో కూడా చెప్పలేక తన మనసులోని ఉన్న భావాలను తెలుపుతున్నాడని అర్ధం , అంటే ఆ ప్రేమను వర్ణించడానికి కూడా మాటలు రావట్లేదని అర్ధం . అదే భావనను తరువాతి రెండు లైన్లలో ఇలా కూడా చెప్పొచ్చా అనే విధంగా అద్భుతమైన పదాలను సమకూర్చడం ద్వారా తెలిపారు చంద్రబోస్ .ఇక్కడ ఒక ప్రేమికుడు తన ప్రేయసి అందం గురుంచి తన మనసులోని భావన ఎంతో అర్ధమవుతోంది . ఇక్కడ అక్షరాల పంజరంలో ప్రేయసి అందాన్ని బంధించలేకపోతున్నాడట ప్రేమికుడు అంటే ఆ అమ్మాయి అందం గురుంచి చెప్పడానికి ఏ భాషలో కూడా పదాలు లేవు అంటే అంత గొప్ప అందం అని అర్ధం, ఇంత చిన్న లైన్లో ఇంత గొప్పగా తెలపడం బోస్ గారికే సొంతం . ఇక ఆ తరువాతి లైన్లో ప్రేమికుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలియజేశారు బోస్ గారు . తన ప్రేయసిపై ఎంతటి ప్రేమ ఉందో తెలుస్తోంది ఈ లైన్ చూస్తే అర్ధమవుతోంది . కేవలం గోడల మధ్యనే కాకుండా సముద్రంలాగా అనంతంగా ఉంటుందని అర్ధం అంటే కేవలం తను ప్రేయసి దగ్గర నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడే కాకుండా ఎక్కడ ఏమి చేస్తున్నా కూడా ఆమె ధ్యాసతో తనని ప్రేమికుడు ఆరాధిస్తాడని అర్ధం , దీనిని ప్రతిబింబిస్తూ ప్రేమను ఒక సాగరంతో పోలుస్తూ ఇరుకు గదిలో ఇమడ్చడం అనే పద ప్రయోగం అమోఘం .

ఇక తరువాతి మూడు లైన్లలో ప్రేమికుడు ప్రేమ ప్రేయసికి ఎలా అర్ధమవుతోంది అనే విషయాన్ని చెప్పారు బోస్ . ప్రేమను చాలా విధాలుగా తెలియజేస్తోంది ముఖ్యంగా స్పర్శతో , మాటలతో ప్రేమ వ్యక్తమవుతోంది . ఇక్కడ ప్రేమలోని పతాక స్థాయిని తెలిపారు బోస్ గారు . ప్రేయసి యొక్క అందాన్ని ఆరాధిస్తూ ఆమె బుగ్గలను తన వేళ్ళతో తడుముతూ ఆమె మీద చుట్టూ తిరుగుతూ తన అధరాలను ఆమె అధరాలతో కలిపిన మధుర క్షణంలో అతని ప్రేమ ఆమెకు అర్ధమవుతోందట . ఇక్కడ అసలైన ప్రేమ ఎలా ఉంటుందో తెలిపారు బోస్ గారు . ప్రేమను తెలపడానికి ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇవ్వవలసిన అవసరం లేదు ఒక సుతారమైన స్పర్శ తో ప్రేయసి దగ్గరకు చేరితే ప్రేమికుడి ప్రేమ అర్ధమవుతుంది . ఇక్కడ చివర్లో ప్రేమ కావ్యం అని రాశారు బోస్ గారు , సామాన్యంగా ఎటువంటి గొప్ప భావనాలైనా కావ్యం ద్వారా వర్ణించవచ్చు , పూర్వపు కవులు అందరూ కూడా ప్రపంచంలోని ఎన్నెన్నో అందాలను , వారి భావనలను పెద్ద కావ్యాలలో వర్ణించారు . అంటే తన అమితమైన ప్రేమని ప్రేమికుడు తన పదాలతో వర్ణించలేకపోయినా కూడా తన సుతారమైన స్పర్శతో , తన దగ్గరకు చేరే విధానం ద్వారా తెలుపుతున్నాడని అర్ధం . ఈ సాహిత్యం చూస్తుంటే ప్రపంచంలో ఉన్న ప్రేమికులు అందరూ తమ జీవితంలోని మధుర స్పృతులను గుర్తు చేసుకుంటారు .

అదిగో అదిగో మరుమల్లికల శిఖరం
అదిగో అదిగో మకరందాల నగరం
అందంలోన చిందే అమృత కిరణం
అడుగుజాడల్లో నడిచినా చాలు
అంటదు ఏ మరణం

ఇక చరణంలో చూస్తే బోస్ గారి ముద్ర ఖచ్చితంగా కనిపిస్తోంది . సాధ్యమైనంతవరకూ బోస్ గారు తన సాహిత్యంలో ప్రకృతిని ప్రస్తావించకుండా ఉండరు . ఇక్కడ ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమని కేవలం 5 లైన్లలో ప్రకృతికి అనుసంధానిస్తూ అద్భుతంగా చెప్పారు బోస్ గారు .

ప్రకృతిలో గడిపితే మనసు ఎంతో హాయిగా ఉంటుంది, అదే ఒక అందమైన పూలతో నిండిన కొండపై గొప్ప సువాసనలతో ఉన్న నగరంలో సూర్యుడి కిరణాలు పడితే ఎలా ఉంటుంది, ఊహించుకుంటేనే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదూ . మరి అటువంటి సమయంలో సూర్యుడి కిరణాలు కూడా అమృత కిరణాలుగా ప్రసరించి ఎవరైనా అమరులు కావల్సిందే . ఇక్కడ ప్రేమికుడు కూడా తన ప్రేమను ఆ ప్రకృతి అంత స్వచ్ఛంగా , మధురంగా భావిస్తూ తన ప్రేమ కూడా ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా అమరంగా ఉంటుందని భావిస్తున్నాడని అర్ధం .

పారే నదిలో పొంగే అలపై తేలే నురగల్లే నేనున్నా
నాకోసం పడవల్లే కదిలేవో
ప్రేమ తీరం నను నీతో నడిపేవో
ఆశగా ఆర్తిగా ఏదేదో అడిగేస్తున్నా
భాషే రాని ఈ భావం
బాధై దాగెను నాలో నాలోలో

ఇక తరువాతి పంక్తులలలో ఈసారి ప్రకృతిలోని ఇంకొక సహజ సిద్ధమైన క్రియను ప్రియుడి ప్రేమతో అనుసంధానించి అద్భుతంగా తెలిపారు చంద్రబోస్ . సామాన్యంగా నదిలోని అలలపై ఉన్న నురగ పడవతో ఒడ్డుకు చేరుతుంది . ఇక్కడ పారే నదిలో అలపై నురగలా తనన్ని తాను భావించుకొని తన ప్రేయసిని పడవగా భావించి తనతో ప్రేమ తీరాలకు చేరాలనేది ప్రేమికుడి అభిలాష . ఇదే విషయాన్ని ఎంతో ఆశతో ప్రియురాలికి తెలపాలని ఉన్నా కూడా తనలోని భావనలను ఏ విధంగా ఏ భాషలో తెలపాలో తెలియక ప్రేమికుడు తనలో తానే బాధపడుతూ ఉన్నాడని చంద్రబోస్ గారు తన పదాల ద్వారా తెలిపారు .

ఈ పాట వింటుంటే ఎవరికైనా ప్రేమలోని మధురాన్ని ఆస్వాదించాలని అనిపిస్తుంది , మరి అంతటి అనుభూతిని అతి కొద్ది లైన్లలో ఇమిడ్చి మనకు అందజేసిన చంద్రబోస్ గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో అర్ధంకాని పరిస్థితి . తన సాహిత్యంతో ఎంతో మందికి స్ఫూర్తిని ,ఆహ్లాదాన్ని అందిస్తున్న చంద్రబోస్ గారి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి . ఆయన రాసిన పాట “మౌనంగానే ఎదగమని” పాటలోలాగే తాను ఉఛ్చ స్థితిలో ఉన్నా కూడా నిగర్వి గా ఉంటూ ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు చంద్రబోస్ గారు . ఆయన కలం నుండి మరెన్నో అద్భుతమైన పదాలు జాలువారాలని కోరుకుందాం

  • ఎస్ ఏ టి శ్రీనాథ్

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments