చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే కాశీనాథుని విశ్వనాథ్.

ముందుగా గుర్తుకొచ్చేవి…
కాశీనాథుని విశ్వనాథ్ పేరు వినగానే ముందుగా ఆయన చిత్రాలలో పెద్ద పీట వేసుకున్న సంగీతసాహిత్యాలు గుర్తుకు వస్తాయి. తరువాత కథల్లోనే లీనమై ఆకర్షించే కళలూ స్ఫురిస్తాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు కళాఖండాలు నవతరం ప్రేక్షకులను సైతం మురిపిస్తూనే ఉన్నాయి. కె.విశ్వనాథ్ చిత్రాలను చూసి ఆ రోజుల్లో ఎందరో లలిత కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తరువాతి రోజుల్లో కళాకారులుగానూ రాణించారు. అంతలా తెలుగువారిని కళలవైపు మళ్ళించిన దర్శకులు మరొకరు కానరారు. ‘శంకరాభరణం’ విడుదలైన రోజుల్లో తెలుగునాటనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ సీమల్లోనూ పలువురు బాలలు గానంపై ధ్యానం పెట్టారు. ఆ చిత్రంతోనే కమర్షియల్ చట్రంలో చిక్కుకున్న తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గౌరవం తీసుకు వచ్చారు విశ్వనాథ్. ‘శంకరాభరణం’ తరువాత విశ్వనాథ్ నిర్దేశకత్వంలో వెలుగు చూసిన “శుభోదయం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం” ఇలా ఎన్నెన్నో కళాఖండాలు మన మదిలో తిష్ట వేసుకున్నాయి.

విశ్వనాథుని బాణీ!
విశ్వనాథ్ సినిమాల్లో మన సంస్కృతి, సంప్రదాయం తప్పకుండా గోచరించేవి. అందుకు తగ్గ సంగీతసాహిత్యాలూ చోటు చేసుకొనేవి. ఆయన చిత్రాల్లో తెరపై ప్రత్యక్షమైన సంప్రదాయ రీతులను చూసి, బాలలు తమ పెద్దవారిని అడిగి మరీ వాటిని తెలుసుకొని ఆచరించిన సందర్భాలూ ఉన్నాయి. విశ్వనాథ్ చిత్రాలలో ఛాందసమే ఉంటుందని కొందరి భావన. అయితే ఆయన కళలకు ఎల్లలు లేవని తన సినిమాల ద్వారా చాటారు. డప్పుకు, గజ్జెకు జోడీ కట్టాలే తప్ప కులాలకు కాదనీ తన సినిమాల ద్వారా చాటిన ఆధునిక సనాతనుడాయన! ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ దాగుంటుందని అంటారు. కొందరు అదృష్టవశాన కళలను పుక్కిట పట్టి పుడతారు. మరికొందరు సాధనతో సాధిస్తారు. ఇంకొందరు వయసుతో నిమిత్తం లేకుండా అభ్యాసం చేసి అలరిస్తారు. మనలో దాగిన కళలను చాటుకుంటూ మన కలలను సాకారం చేసుకోవాలనీ తన చిత్రాల ద్వారా చాటారు విశ్వనాథ్. ఆ తీరును మననం చేసుకున్నా మది పులకించి పోవలసిందే!

‘ఆత్మగౌరవం’తో ఆరంభం!
కె.విశ్వనాథ్ కు తొలి నుంచీ కళారాధన అధికం. సకల కళలకూ నెలవైన విశ్వనాథుని పేరు పెట్టుకున్న ఆయన మనసు చిత్రసీమవైపు మరలడంలో ఆశ్చర్యమేముంది?… బిఎస్సీ పట్టా పుచ్చుకోగానే సినిమా రంగంలో అడుగుపెట్టారు విశ్వనాథ్. ఆరంభంలో శబ్దంతో దోస్తీ చేస్తూ సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేశారు. వి.శివరామ్ వద్ద పలు చిత్రాలకు సౌండ్ విభాగంలో పనిచేశాక, ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావును విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. ‘ఆత్మగౌరవం’ చిత్రంతో కె.విశ్వనాథ్ ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. తొలి చిత్రంలోనే తనదైన బాణీ ప్రదర్శించారు విశ్వనాథ్.

నందమూరితో నాలుగు!
ఏయన్నార్ సినిమాతో దర్శకునిగా పరిచయమైన విశ్వనాథ్, యన్టీఆర్ తో నాలుగు చిత్రాలు రూపొందించారు. రామారావుతో విశ్వనాథుని తొలి చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. తరువాత “నిండు హృదయాలు, నిండుదంపతులు, చిన్ననాటి స్నేహితులు” తీశారు. వాటిలో ‘నిండు హృదయాలు’ మంచి విజయం సాధించింది. అయితే ‘కలిసొచ్చిన అదృష్టం’లోనే యన్టీఆర్ ను కొత్తగా చూపించాలని తపించారు విశ్వనాథ్. తరువాత కూడా రామారావుతో ప్రయోగాలు చేశారనే చెప్పాలి.

పలువురికి తారాపథం…
నాటి మేటి నటులతో చిత్రాలను తెరకెక్కించినా, విశ్వనాథ్ కు అచ్చివచ్చిన కథానాయకుడు శోభన్ బాబు అనే చెప్పాలి. అదే రీతిన శోభన్ కు కూడా విశ్వనాథ్ సినిమాలు కలిసొచ్చాయనీ చెప్పొచ్చు. ‘చెల్లెలికాపురం’తో శోభన్ బాబును విలక్షణ నటునిగా నిలిపారు విశ్వనాథ్. ఆ తరువాత “కాలం మారింది, శారద, జీవనజ్యోతి” వంటి సినిమాలతో శోభన్ కు స్టార్ డమ్ కట్టబెట్టిందీ విశ్వనాథ్ చిత్రాలే. నాటి మరో వర్ధమాన కథానాయకుడు కృష్ణతోనూ అలరించే చిత్రాలను తెరకెక్కించారు విశ్వనాథ్. “ఉండమ్మా బొట్టు పెడతా, నేరము-శిక్ష” వంటి చిత్రాల్లో కృష్ణను విలక్షణంగా చూపించారు. ఆ మాటకొస్తే తన రెండవ చిత్రం ‘ప్రైవేట్ మాస్టర్’లో కృష్ణను ప్రతినాయకునిగానూ నటింపచేశారు. ఇలా నటులను వైవిద్యంగా చూపించడంలోనూ విశ్వనాథ్ ప్రయోగాలు చేశారు. అగ్ర నటులు అందించిన అవకాశాలను విశ్వనాథ్ సరిగా ఉపయోగించుకోలేక పోయారు అనేవారూ ఉన్నారు. అయితే వర్ధమాన కథానాయకులను వైవిధ్యమైన పాత్రల్లో నటింపచేసి వారికి జనం మదిలో చోటు కల్పించడంలో సఫలీకృతులయ్యారు విశ్వనాథ్. స్టార్స్ తో ఆయన తారాపథం చేరుకోలేదు కానీ, ఆయన చిత్రాల ద్వారా పలువురికి తారాపథం చూపించారు.

నటనాభిషేకం
విశ్వనాథ్ సినిమాల్లో నటిస్తే చాలు అనుకొనేవారెందరో… అలా అనుకున్నవారికి విశ్వనాథ్ చిత్రాలే అభినయంలో శిక్షణ ఇచ్చాయని చెప్పాలి… నటులకు శిక్షణ ఇచ్చిన విశ్వనాథుడు తరువాత నటునిగానూ మురిపించిన వైనం మరపురానిది. ‘శుభసంకల్పం’తో నటునిగా మారిన తరువాత కె.విశ్వనాథ్ వైపు పలు పాత్రలు పరుగులు తీస్తూ వచ్చాయి. అప్పటి దాకా ఎంతోమంది నటీనటులను తీర్చిదిద్దిన విశ్వనాథ్ ఒక్కసారిగా నటనలో బిజీ అయిపోయారు. మహామహులతో పనిచేసిన విశ్వనాథ్ ను డైరెక్ట్ చేసే అదృష్టం కలిగినందుకు ఆ యా చిత్రాల దర్శకులు పులకించిపోయేవారు. నటునిగా రాణించడం మొదలు పెట్టాక, దర్శకత్వానికి దూరంగానే జరిగారు విశ్వనాథ్. అయితే ఆయన దర్శకత్వం అంటే ప్రాణం పెట్టేవారు మళ్ళీ మెగా ఫోన్ పట్టమని బలవంతం చేశారు. కానీ, కళాతపస్వి అంతకు ముందులా దర్శకత్వంతో ఆకట్టుకోలేక పోయారు. అందుకే దర్శకత్వానికి స్వస్తి అన్నారు. ఇక తన దరికి చేరిన పాత్రలకు మాత్రం న్యాయం చేయడానికి విశ్వనాథ్ తపించారు.

లలిత కళారాధనలో…
విశ్వనాథ్ లోని కళాతపస్వికి అలసట లేదు. అందుకే తనకిష్టమైన కళల గురించి ఇప్పటికీ లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ కళారాధనతోనే తొమ్మిది పదుల వయసులోనూ ఆనందిస్తున్నారు. ఆయన శరీరానికి తొంభై ఒక్క సంవత్సరాలు వచ్చి ఉండవచ్చు. మనసు మాత్రం హుషారుగానే ఉంటుంది. ఈ వయసులో విశ్వనాథునికి విసుగు కలిగించడం ఇష్టం లేక ఆయన గత చిత్రాలతోనే అభిమానులు ఆనందిస్తున్నారు. ఎన్ని సార్లు చూసినా తనివి తీరలేదంటూ పులకించిపోతున్నారు. కళాతపస్వి చిత్రాలతో పరిచయం కలిగితే చాలు మనసు పరవశిస్తుంది. లలితకళల్లో ప్రవేశం ఉన్నా లేకున్నా- గాత్రం ఆత్రంగా పాడాలనుకుంటుంది.. పదం పదనిసలకు తగ్గట్టు ఆడాలనుకుంటుంది. తత్ఫలితంగా భవిష్యత్ లో మరికొందరు కళాకారులు ఉదయించవచ్చు. అదీ విశ్వనాథ్ చిత్రాల మహిమ. ఆ కళాతపస్వి మరిన్ని వసంతాలు ఆనందంగా చూస్తూ సాగాలని ఆశిద్దాం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments