ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం నెల్లూరులో పర్యటించనున్నారు. సీఎం జగన్ టూర్‌కు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నవరత్నాల హమీలో భాగంగా అమ్మఒడికి వరుసగా రెండో ఏడు కూడా శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నెల్లూరులో ‘అమ్మఒడి’ పథకం రెండో విడత చెల్లింపులు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ ఉదయం 9.45గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరనున్నారు. 11.10గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. 11.30 గంటలకు నెల్లూరు వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘అమ్మఒడి’ పథకం రెండో ఏడాది కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3గంటలకు తాడేపల్లి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. మరోవైపు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలావుంటే, ‘అమ్మఒడి’ కార్యక్రమంలో ఎన్నికల కోడ్ పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్క్యులర్ జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘అమ్మఒడి’ కార్యక్రమంలో రాజకీయ నాయకులు పాల్గొనకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రమే పాల్గొనాలని, పట్టణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొనవచ్చని ఉత్తర్వుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ‘అమ్మఒడి’ గతంలోనే ప్రారంభించిన పథకమైనందున యథావిధిగా అమలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టకూడదని స్పష్టంచేసింది. నెల్లూరు నగరంలో సీఎం జగన్ రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు.