ప్రేమ , ఈ అనుభూతిని వర్ణించడానికి ఏ మాటలు సరిపోవు . ఏ సమయంలో ఎవరిమీద ఏ విధంగా ఈ ప్రేమ కలుగుతుందో ఊహించలేం . అంత గొప్పది ఈ ప్రేమ . అందులో ఒక అమ్మాయి పట్ల ఉన్న ప్రేమ అనిర్వచనీయం . ఏ భాషలోనైనా ప్రేమపై వచ్చిన పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి . అటువంటి పాటలలో ఒకటి విక్టరీ వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ నటించిన వసంతం చిత్రంలోని “నిను చూడక ” పాట . ఈ పాటను విన్నంత సేపు ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది , మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది . ఎస్ ఏ రాజ్ కుమార్ స్వర రచన చేయగా ప్రఖ్యాత గేయ రచయత కులశేఖర్ గారు పద రచన చేశారు .

ప్రేమ లో ఉన్నప్పుడు ఎంతటి గొప్పవాడికైనా తన ప్రేయసి ఆలోచనలే వెంటాడుతుంటాయి . ఆమె తప్ప ప్రపంచంలో ఇంకెవరూ అందంగా కనిపించరు . మరి ఇటువంటి సందర్భంలో ఈ పాట మన ముందుకు వచ్చింది . ఈ పాటలోని సాహిత్యం చూస్తే కులశేఖర్ గారి రచనా పఠిమ ఎంతో తెలుస్తుంది . ప్రతి లైన్ లో నూ ఆయన రచన అమోఘం . సంగీతానికి అనుగుణంగా సరళమైన పదాలతో ప్రేమికుని మనసులోని భావనలను తెలియజేసారు .

ఇప్పుడు ఈ పాటలోని సాహిత్యం గురుంచి తెలుసుకుందాం

నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని
నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని
నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదుమరీ
మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ
పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా
ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ
ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ

ఈ పాట మొత్తం ఒక ప్రేమికుడి మనసులోని భావాలను చక్కగా తెలియజేసారు కులశేఖర్ గారు . ఇక పల్లవిలో ప్రేమికుడికి తన ప్రేయసి మాత్రమే అందంగా కనిపిస్తుందన్న విషయాన్ని అందంగా వర్ణించారు . తన ప్రేయసిని చూసినప్పుడే అసలు అందం అనేది తెలిసిందని , అప్పటినుంచి ఆలోచనలతో నిద్దరపట్టడం లేదని ప్రేమికుడి యొక్క భావన . ఇంకా ప్రేమికుడు మనసులోని భావనలను చాలా అందంగా తెలియజేసారు . ప్రేయసిని తలుచుకున్నప్పుడల్లా ఎదో తెలియని ఆనందం అన్న విషయాన్ని మదిలో మల్లెల వాన కురిసినట్టుగా వర్ణించటం అమోఘం . అలాగే తన జీవితంలోకి ప్రేయసి వచ్చినప్పటి నుండి పగలే వెన్నెల్ల చూస్తున్నట్టు భావిస్తాడు అంటే తన ప్రేయసి అంత అందం అని అర్ధం . పల్లవి లోని చివరి రెండు లైన్లు లో తన ప్రేయసిని ప్రియుడు ఎలా చూసుకుంటాడు అనే విషయాన్ని తెలియజేస్తాయి . ఎన్ని బొమ్మలు ఉన్నా పాల రాతి బొమ్మలకు , కొండపల్లి బొమ్మలకు ఉన్న అందం వేరు . వాటి అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు . అంతటి గొప్ప బొమ్మలకు ఉన్న అందం తన ప్రేయసికి ఉందని ప్రేమికుడి భావన . ప్రేయసి తన ఊపిరై తనకు కొత్త జన్మ లభించినట్టుగా ప్రేమికుడు భావనలను కులశేఖర్ చాలా సరళంగా అందరికీ అర్ధమయ్యే విధంగా కులశేఖర్ తెలియజేసారు .

రంగు రంగు పువ్వుల్లో లేనెలేదు ఈ గంధం
నిన్ను తాకి పొందిందా చల్లగాలి సాయంత్రం
వేలవేల భాషల్లో లేనేలేదు ఇంతందం
తేలికైన నీమాటే సుస్వరాలసంగీతం
ఓ, నీలోని ఈ మౌనం కవితే అనుకొనా, నవ కవితే అనుకోనా
నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓమైనా
సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా
నువుకాని దూరమైతే నాగుండె ఆగిపోదా

ప్రేమికుడి యొక్క భావనలను ప్రకృతిలోని విషయాలతో ముడిపెడుతూ అత్యంత అద్భుతంగా వర్ణించారు కులశేఖర్ . ఏ పువ్వులోని సువాసన కూడా తన ప్రేయసి ముందు సరిపోదు అనే ఉపమానం అద్భుతం . యావత్ లోకం మొత్తం ఉదయం పనిచేసి సాయంకాలం కోసం ఎదురుచూస్తుంది , ఎందుకంటే సాయంత్రం వీచే చల్లటి గాలిని ఆస్వాదించడానికి . మరి అటువంటి హాయినిచ్చే చల్ల గాలి సైతం సాయంత్రం తన చెలిని తాకడం వలెనే వచ్చిందని ప్రియుడు భావిస్తాడని కవి భావన , అంటే ఇక్కడ ప్రేమికుడికి తన సఖిపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తోంది సామాన్యం భాషలలో ఎంతో శ్రావ్యత ఉంటుంది మరి అటువంటి భాషలు ఏవి కూడా తన ప్రేయసి అందం ముందు సరిపోదని , తన ప్రేయసి ఏ మాట మాట్లాడినా తన చెవులకు చాలా శ్రావ్యంగా ఉండి అద్భుతమైన సంగీతంగా ప్రేమికుడికి అనిపించడం కులశేఖర్ గారి రచనా ప్రతిభకు మచ్చుతునక .

ఇక దాని తరువాత లైన్లో ప్రేమికుడు యొక్క మరికొన్ని భావాలను ఎవరూ ఊహించలేని విధంగా తెలియజేసారు కులశేఖర్ గారు . తన ప్రేయసి ఏమి మాట్లాడక పోయినా తనకు ఒక అద్భుతమైన కవిత చెప్పినంత హాయిగా ఉందని , తన ప్రాణం ఎప్పుడూ కూడా తన ప్రేయసి కోసం ఆరాట పడుతుందని తెలియజేసారు , అంటే తన ప్రేయసిని తాను ఎంత గొప్పగా భావిస్తున్నాడో , తన జీవిత గమ్యం తన ప్రేయసేనని ప్రేమికుడు భావిస్తున్నట్టు అర్ధం . సూర్యుడు అస్తమిస్తే లోకమంతా చీకటైనట్టుగా తన ప్రేయసి తనకు దూరమైతే తన గుండె ఆగిపోయినట్టుగా భావిస్తున్నాడు అంటే ప్రేమికుడు తన ప్రేయసిని ఎంత గొప్పగా ఆరాధిస్తున్నాడో తెలుస్తోంది .

నీలినీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు
కాటుకమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు
ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు
పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు
ఓ, నాలోని ఈ భావం ప్రేమ అనుకోనా, తొలిప్రేమే అనుకొనా
ఈ వేళ ఈ రాగం వరమే అనుకోనా కలవరమా నిజమేనా
ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక
నీలాల కంటిపాప రాసింది మౌనలేఖ

మొదటి చరణంలో ప్రేమికుడు తన ప్రేయసి గురుంచి ఏ విధంగా భావిస్తున్నాడో అత్యంత సరళంగా అద్భుతంగా తెలియజేసారు కులశేఖర గారు . అయితే ప్రేమికుడు తన ప్రేయసి సౌందర్యం గురుంచి ఏ విధంగా ఆలోచిస్తాడనే విషయాన్ని ఎవరూ ఊహించలేని విధంగా కులశేఖర్ తెలిపారు .

మొదటగా ప్రేయసి కనుల అందం గురుంచి ప్రేమికుడు భావన ఎలా ఉంది అనేది వర్ణించారు . తన ప్రేయసి నయన సౌందర్యం ముంది అన్నీ చిన్నవేనని , ప్రేయసి కనులకు ఉన్న కాటుక కానక కవి అయితే ఆ అందాన్ని వర్ణించడానికి ఎన్నో వేల గ్రంధాలు రాస్తుందని భావిస్తాడట , అంటే తన ప్రేయసి నయన సౌందర్యం వర్ణించడానికి పదాలు చాలడం లేదని అర్ధం . ఇక ప్రేయసి నవ్వును ప్రియుడు ఏ విధంగా భావిస్తాడని ఇక్కడ కవి అద్భుతంగా వర్ణించారు . తన ప్రేయసి నవ్వినప్పుడు ముత్యాలు రాలుతున్నట్టు ప్రేమికుడు భావిస్తాడని అంటే తన ప్రేయసి నవ్వుతూ హాయిగా ఉంటే తనకు ఎంతో హాయిగా ఉంటుందని అర్ధం అలాగే తన ప్రేయసి అధర సౌందర్యం తనను చూపు మలుపుకోకుండా చేస్తోందని , పంచదార ఉన్నంత మధురంగా ఆమె పెదాలు ఉన్నాయని , ఆ ఆలోచనలను నుండి బయట పడడం అసాధ్యం అని ప్రేమికుడి భావన . మరి ఇన్ని భావనలు కలుగుతున్నాయి కాబట్టి ఇది తొలి ప్రేమేనా అనే సందిగ్ధంలో ప్రేమికుడు పడ్డాడని భావన .

మరి ఆ ప్రేమని ఏ విధంగా ప్రేమికుడు తన ప్రేయసికి తెలియజేసాడనే విషయాన్ని ఈ చివరి రెండు లైన్ల ద్వారా ఎవరూ ఊహించలేని విధంగా తెలియజేసారు కులశేఖర్ . ప్రేమికుడు తన ప్రేయసికి తన ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక తన కళ్ళు ద్వారా తన ప్రేయసికి తెలియజేసాడని భావం . సామాన్యంగా ఎవరైనా ప్రేమలేఖలు రాస్తారు , అయితే ఇక్కడ ప్రేమికుడు ప్రేమ లేఖల ద్వారా , మాటల ద్వారా చెప్పలేక మౌన లేఖ ద్వారా చెప్పారనే వర్ణన చూస్తే ఎవరైనా ఇలా రాయగలరా అనిపిస్తుంది , అంటే ప్రేమికుడికి తన ప్రేయసి పై అవధులు లేవని అర్ధం .

ప్రతీ వ్యక్తి ఎదో ఒక్క సమయంలో ఈ ప్రేమ అనే అద్భుతమైన భావనను పొందుతారు . అయితే ఆ ప్రేమను కులశేఖర్ గారు అందరికీ అర్ధమయ్యే విధంగా చాలా అద్భుతంగా వర్ణించారు . ఒక భావనను ఒక సినిమా పాటలో ఇంతకంటే ఎవరైనా వర్ణించగలరా అన్నట్టుగా ఈ పాట చూస్తే అర్ధమవుతుంది . తన గురువైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఏమాత్రం తీసిపోకుండా కులశేఖర్ ఈ పాటను రచించారు , అయితే ఆయన దక్కవలసిన గౌరవం దక్కలేదని వాస్తవం . ఇంత గొప్ప పాండిత్యం , తెలుగు వ్యాకరణం తెలిసిన కులశేఖర్ గారు మళ్ళీ సినిమా పాటలతో మన ముందుకు సాహిత్య అభిలాషుల దాహం తీర్చాలనేది మా కోరిక .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments