బీజేపీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్టోబర్ 15న వరద నష్టంపై ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. కర్ణాటక సీఎం లేఖ రాస్తే పీఎం వెంటనే స్పందించి రూ.669 కోట్లు విడుదల చేశారని, అలాగే గుజరాత్‌కు రూ.500కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ సీఎం లేఖకు మాత్రం స్పందన లేదన్నారు.

నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి ఒక్క పైసా తీసుకు రాలేదని ఘాటు విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి నిస్సహాయ మంత్రి అని, బీజేపీ బాధ్యత రాహిత్య పార్టీ అని ఎద్దేవా చేశారు. తమది మనసున్న ప్రభుత్వమని, మరో 100కోట్లు ఇచ్చైనా, అందరికీ సహాయం అందిస్తామన్నారు. కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని, ప్రజలెవరూ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సైదాబాద్‌లో అభిషేక్ అనే బీజేపీ కార్యకర్త సహాయం తీసుకుని మళ్ళీ వెళ్లి ధర్నాలో కూర్చున్నాడని విమర్శించారు. ఇంత చిల్లర రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. అందరికీ సహాయం అందుతుందని కేటీఆర్ తేల్చి చెప్పారు.

ఇక కాంగ్రెస్‌ గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆక్రమణలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, కాంగ్రెస్ ఆనాడు ఆక్రమణలు తొలగిస్తే ఈ పరిస్థితి వచ్చేదా? అన్నారు. హైదరాబాద్ ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు ఒక్క పైసా అయినా ఇచ్చారా? అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments