గ్రేటర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. నవంబర్ 2వ వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు అవకాశం ఉంది. గెలుపోటములపై సర్వే చేయించిన టీఆర్ఎస్.. వీక్‌గా ఉన్న డివిజన్లపై దృష్టిపెట్టింది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

పనితీరు మార్చుకోవాలంటూ.. 15మంది కార్పొరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ రెండో వారం తర్వాత ఏ క్షణమైనా ఎన్నిలు జరిగే అవకాశం ఉండటంతో. ప్రధాన పార్టీలు ఆ దిశగా ఫోకస్ పెట్టాయి. డివిజన్లు, అభ్యర్థుల, బలాబలాలపై దృష్టిసారించాయి. ఇక.. మరోసారి గ్రేటర్‌లో పాగా వేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ స్కెచ్చులేస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్‌లో పట్టు సడలనీయకూడదని భావిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌లతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యుహాలు. చేసిన పనుల గురించి ప్రస్తావించాలని వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా. పక్కాగా విజయం సాధిస్తామని మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చెప్పారు. దానికి తగ్గట్లే టీఆర్ఎస్ అధిష్టానం సర్వే చేయించింది. అయితే.. 15 డివిజన్లలో కాస్త ఇబ్బంది ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంతో. ఆ 15 డివిజన్ల కార్పొరేటర్లకు తాజా సమావేశంలో కేటీఆర్ క్లాస్ తీసుకున్నారు. పని తీరు బాగోలేనందున మార్చుకోవాలని.. లేకుంటే.. మరోసారి టికెట్ ఇవ్వడం కష్టమనే సంకేతాలిచ్చారు.

నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే.. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని సుతిమెత్తగా చురకలంటించారు. హైదరాబాద్‌ అభివృద్ధి.. లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిన విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్. ఐదేళ్లలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామో వివరించారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా అందరూ రెడీగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు కేటీఆర్.

కరోనా వైరస్, ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు మాత్రం ఆగడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఉద్యోగుల జీతాల్లో కోత మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతలు విధించి మరీ పేదలను ఆదుకున్న విషయాన్ని వివరించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇప్పటికి 60వేల కోట్ల రూపాయలు వెచ్చించామన్న కేటీఆర్.. కార్పోరేటర్లకు ఇంకా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టి కి తీసుకురావాలని చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు. గ్రేటర్‌ను ఎలాగైనా మరోసారి కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు పన్నుతోంది TRS.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments