కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న దేవుడు. పేద ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న హీరోలాంటి విలన్. వలస జీవులనే కాదు.. కష్టజీవులకు కూడా తోడున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్న మానవత్వమున్న మనిషి అతడు. అన్నా అంటే.. నేనున్నా అంటూ వెంటనే స్పందించే దయార్ద్ర హృదయుడు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించో తెలిసింది కదా.. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన ఆ మహానుభావుడిని చాలామంది ఇప్పటికే గుర్తించే ఉంటారు. ఆయనే సినీ రంగంలో విలన్‌గా రాణిస్తున్న రియల్ హీరో సోనూసూద్. సినిమా రంగంలో ఒక సంచలనాన్ని సృష్టించిన అరుంధతి సినిమాలో ‘‘ ఒసేయ్ అరుంధతీ.. నీకు పెళ్లా..! నన్ను చంపి ఈ సమాధిలో కుళ్లబెట్టిన నిన్ను వదల బొమ్మాళీ వదలా..! అంటూ చలనచిత్ర రంగంలో ఒక ఊపు ఊపిన ఈ డైలాగ్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో గూడుకట్టుకున్న రియల్ స్టార్ అతడు.
ఇప్పుడు ఆయన దృష్టంతా పేదలకు సాయం చేయడంపైనే ఉంది. ఒకదశలో పేదలు తమ సమస్యలు ప్రభుత్వాలకు చెప్పడం కన్నా సోనూసూద్‌కు చెబితేనే త్వరగా పరిష్కారం అవుతాయన్న నిర్ణయానికి వచ్చారు దేశ ప్రజలు. నిన్న గాక మొన్న చిత్తూరు జిల్లాలో ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లను ఎడ్లలాగా వినియోగించి భూమి దున్నుతున్న పరిస్థితిని చూసి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అతడికి ట్రాక్టర్ కొని పంపి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలా అనేకమందికి ఆసరాగా నిలుస్తున్న సోనూసూద్ ఇంతలా ఖర్చు పెడుతున్నారు. అసలు ఇయనకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్న ప్రశ్న చాలామందిలో ఉదయిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులు తమకు వేలాది కోట్ల ఆస్తులు ఉన్నా కష్టాల్లో ఉన్న ప్రజలను పట్టించుకోవడం లేదు. అయితే సోనూసూద్ మాత్రం కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన నుంచి సాయం పొందిన వారు సోనూసూద్‌ను దేవుడిగా భావిస్తున్నారు.
అయితే సోనూ సూద్ ఆస్తుల విలువ ఎంత ఉందన్న దానిపై తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం చేసింది. ఆయనకు రూ.130 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సదరు మీడియా సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. పేదలను ఆదుకునేందుకు సోనూసూద్ ఇప్పటి వరకు పది కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు తెలిసింది. ముంబయిలో సోనూసూద్‌కు పెద్ద ఇల్లు ఉంది. హోటళ్లు కూడా ఉన్నాయి. తన హోటళ్లను వైద్యుల కోసం ఆయన కేటాయించారు. సినిమాల్లో సంపాదించిన సొమ్ము నుంచే ఆయన పేదలకు ఖర్చు చేస్తున్నారు. సోనూసూద్‌ను ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు ఆదర్శంగా తీసుకుంటే, ఎంతో మంది నిరుపేదలను ఆదుకోవచ్చని ఆయన అభిమానులు చెబుతున్నారు. పేదల గుండెల్లో నిలిచిన సోనూసూద్ తన పుట్టిన రోజును రేపు (బుధవారం) జరుపుకుంటున్నారు. అందరం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుదాం.