బాలీవుడ్లో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2020 ఇంకా ఎంత మందిని తీసుకెళ్తుందో తెలియదు కానీ ఎప్పుడు ఎలాంటి వార్త వస్తుందో అని భయపడుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు కూడా. తాజాగా ఇప్పుడు మరో లెజెండరీ నటి కూడా కన్నుమూశారు. మదర్ ఇండియా ఫేమ్ కుంకుమ్ అనారోగ్యంతో మరణించారు. ఈమె వయసు 86 సంవత్సరాలు. కొన్ని రోజుల నుంచి ఈమె వయోభారంతో బాధ పడుతున్నారు. బాలీవుడ్లో దాదాపు 100 సినిమాలకు పైగానే నటించారు ఈమె.
మదర్ ఇండియాతో గుర్తింపు తెచ్చుకున్న కుంకుమ్.. ఆ తర్వాత కోహినూర్, ఉజాలా, ఏక్ సపేరా ఏక్ లూఠేరా, నయా దౌర్, రాజా ఔర్ రంక్, గీత్, ఆంఖేన్, లల్కర్ లాంటి ఎన్నో సినిమాలు చేసింది కుంకుమ్. భోజ్‌పురిలో తెరకెక్కిన తొలి సినిమాలో కూడా కుంకుమ్ నటించారు. ఆ ఘనతను కూడా సొంతం చేసుకున్నారు ఈమె.
బాలీవుడ్ నటుడు నావేద్ జాఫ్రీ ఈమె మరణంపై సంతాపం వ్యక్తం చేసాడు. మనం మరో లెజెండ్‌ను పోగొట్టుకున్నాం.. నా చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను.. ఆమె మృతి ఇండియన్ సినిమాకు తీరనిలోటు అంటూ ట్వీట్ చేసాడు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా కుంకుమ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.