భారత ప్రధాని నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఏకంగా ఆరు కోట్లకు చేరుకుంది. సోషల్ మీడియాలో మోదీకి విపరీతమైన జనాదరణ ఉంది. ట్విట్టర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించే మోదీ.. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. మోదీ జనవరి 2009లో ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. మోదీ 2,354 మందిని ఫాలో అవుతున్నారు. గతేడాది సెప్టెంబరు నాటికి మోదీ ఫాలోవర్ల సంఖ్య ఐదు కోట్లుగా ఉండేది. అయితే, ఏడాది కూడా కాకముందే కొత్తగా మరో కోటి మంది వచ్చి చేరారు. కాగా, ప్రధానమంత్రి కార్యాలయ ట్విట్టర్‌ను 3.7 కోట్ల మంది అనుసరిస్తున్నారు.
ఏప్రిల్ 2015లో ట్విట్టర్లో చేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 1.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, ఆయన 267 మందిని ఫాలో అవుతున్నారు. మరోవైపు, మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా పెద్ద సంఖ్యలో అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి 4.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 8.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా ఆయన 46 మందిని మాత్రమే అనుసరిస్తున్నారు.