రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఊహించడం కష్టం. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా దూసుకుపోతున్న బీజేపీ… రాష్ట్రంలో గులాబీ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది. తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్‌గా వచ్చిన బండి సంజయ్… టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడంలో కాంగ్రెస్‌ను మించిపోతున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల వరంగల్‌లో నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించడం… తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ వేడిని మరింతగా పెంచాయి.

అటు టీఆర్ఎస్ నేతలు, అటు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శల దాడిని పెంచుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో బెంగాల్ ప్రస్తావన తీసుకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణలో తాము బలపడతామని బీజేపీ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ బీజేపీకి అంత సీన్ లేదని టీఆర్ఎస్ కూడా అంతే గట్టిగా వాదిస్తోంది. ఈ క్రమంలోనే తాజా వివాదంతో టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో బెంగాల్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. బెంగాల్‌లోనూ బీజేపీ ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేసిందని ఆరోపిస్తున్నారు.

అక్కడ బీజేపీ నేతలపై ఎలాంటి దాడులు జరగకపోయినా.. తమ నేతలపై దాడులు చేస్తున్నారని గగ్గోలు పెట్టిందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. వారికి చెక్ చెప్పేందుకు గులాబీ శ్రేణులు కూడా అంతే గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments