మంచి పనులు చేస్తే ఎవరినైనా మెచ్చుకోవాల్సిందే. అది కూడా ఓ మంచి పనే. అయితే రాజకీయాల్లో మాత్రం ఇలాంటివి వర్కవుట్ కావని అంటుంటారు చాలామంది. రాజకీయాల్లో ఎవరైనా మంచి పని పనులు చేసినా… వాటిని వారి ప్రత్యర్థులు మెచ్చుకునే సందర్భాలు చాలా తక్కువ. కానీ.. ఇందుకు తాను భిన్నమని నిరూపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనేకసార్లు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్… రాష్ట్రంలో అంబులెన్స్‌లను ప్రవేశపెట్టినందుకు జగన్‌ను ప్రశంసించారు. కరోనా టెస్టులను ఎక్కువ సంఖ్యలో చేయడం పట్ల కూడా ఏపీ సర్కార్‌ను పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు.
అయితే ఈ రెండు అంశాల్లో జగన్ తీరును మెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదనపై మరోసారి వైసీపీ సర్కార్‌ను విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. అంతే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరును మరోసారి తప్పుబట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా అంశాలవారీగా జగన్ సర్కార్‌పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై రాజకీయవర్గాలతో పాటు జనసేన వర్గాల్లోనూ చర్చ జరుగుతోందని తెలుస్తోంది. అంబులెన్స్, కరోనా టెస్టుల విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌ను మెచ్చుకోగా… అంబులెన్స్‌ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని… కరోనా టెస్టుల విషయంలో నాణ్యత సరిగ్గా లేదని టీడీపీ విమర్శించింది. అయితే టీడీపీ చేసిన విమర్శలే పవన్ కళ్యాణ్ సైతం చేయాలని లేకున్నా.. ఈ అంశాల్లో ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం ద్వారా వారికి కూడా ఓ అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమో అనే వాదన వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌ను పలు అంశాల్లో మెచ్చుకోవడంలో ఎలాంటి తప్పులేదనే టాక్ కూడా వినిపిస్తోంది.
ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తాం.. తప్పు చేస్తే ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ ఎఫ్పుడో చెప్పారని జనసేనలోని పలువురు చెబుతున్నారు. అంతేకాదు… ఇలా కొన్ని అంశాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల… టీడీపీ, జనసేన ఒకటే అని వైసీపీ చేసే విమర్శలకు కూడా చెక్ చెప్పినట్టు అవుతుందని జనసేన అభిప్రాయపడుతోంది. ఏదేమైనా… పవన్ కళ్యాణ్ ఏపీలో భిన్నమైన రాజకీయాలు చేస్తున్నారా ? లేక రాజకీయాలు తెలియక తికమకపడుతున్నారా ? అన్నది చాలామందికి అంతుచిక్కడం లేదు.