త్రైత సిద్దాంతకర్త ప్రబోధానందస్వామి అనారోగ్యంతో మృతి చెందారు. తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆయన ఆశ్రమం నడిపిన విషయం తెలిసిందే. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు. 1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. తొలుత భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా ఆయన పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించారు. వైద్యుడిగా సేవలందిస్తూనే ఆయుర్వేదంపై పుస్తకాన్ని రచించారు. ఇదే సమయంలో ఆథ్యాత్మిక అంశాలపై కూడా గ్రంథాలను రచించారు. అనంతరం ఆథ్యాత్మిక గురువుగా మారారు. ఈయన త్రైత సిద్ధాంతాన్ని బోధించేవారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేననేదే ఈ సిద్ధాంతం. ఆధ్మాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశారు. ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారు. హిందూ, ముస్లిం దేవుళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీశాయి. రెండేళ్ల క్రితం జేసీ దివాకరరెడ్డి వర్గీయులకు, ప్రబోధానంద స్వామి శిష్యుల మధ్య భారీ ఘర్షణ కూడా జరిగింది. జేసీతో వైరంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రబోధనందా స్వామి సంచలనంగా మారారు. ప్రబోధానంద స్వామి మరణంతో వేలాది మంది మంది భక్తులు విషాదంలో మునిగిపోయారు. తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడకు ఆయన భౌతిక ఖాయాన్ని తరలించారు. కడప జిల్లా కొండాపురం మండలం బెడుదురు కొట్టాలపల్లిలో ప్రబోధానంద స్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments